AP Home Minister Anitha: ఏపీ హోంమంత్రి అనిత కీలక వివరాలను వెల్లడించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. సుమారుగా ఏడాదిన్నర క్రితం నిలిచిపోయినటువంటి కానిస్టేబుళ్ల నియామక పరీక్షల ప్రక్రియను తిరిగి ప్రారంభించబోతున్నట్లు ఆమె తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం శారీరక సామర్థ్య పరీక్షలను రాబోయే ఐదు నెలల్లో పూర్తి చేయనున్నట్లు హోంమంత్రి చెప్పారు. సంబంధిత వెబ్ సైట్ లో పూర్తి వివరాలను అభ్యర్థులను పొందుపరచాలన్నారు. అయితే, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ వాయిదా పడినట్లు ఆమె స్పష్టం చేశారు.
Also Read: వైసీపీకి ఝలక్ ఇచ్చిన పవన్.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. రెడీగా ఉండండి అంటూ ప్రకటన
కాగా, 2022 సమయంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరు అయ్యారని, అందులో 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారని ఆమె చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు పలు అంశాల కారణంగా వాయిదా పడడంతో పోలీస్ డిపార్ట్ మెంట్ లో మొత్తం కానిస్టేబుల్ (సివిల్) – 3580, కానిస్టేబుల్ (ఏపీఎస్పీ) – 2520 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వాయిదా పడిందని ఆమె వివరించారు.
ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు 3,622 మంది హోంగార్డులు హాజరయ్యారని, అందులో 382 మంది హోంగార్డులు మాత్రమే అర్హత సాధించారని చెప్పారు. అయితే, ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు 14 రిట్ పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేసి.. తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని వారు కోర్టుకు విన్నవించారని పేర్కొన్నారు. కాగా, ఆ వంద మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. ఆ నేపథ్యంలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన ప్రక్రియలో గత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదంటూ ఆమె గుర్తు చేశారు.
Also Read: వైసీపీకి ఝలక్ ఇచ్చిన పవన్.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. రెడీగా ఉండండి అంటూ ప్రకటన
దీనిపై కూటమి ప్రభుత్వం కానిస్టేబుల్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. న్యాయ నిపుణుల సలహా మేరకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో రెండో దశను వెంటనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన రెండో దశ అప్లికేషన్ ఫారం సంబంధిత వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె చెప్పారు. రెండో దశలో ఎవరైతే ఉత్తీర్ణులైతారో వారికి మాత్రమే మూడవ దశ.. ప్రధాన పరీక్ష నిర్వహిస్తామంటూ హోంమంత్రి అనిత తెలిపారు.