Guntur Car Fire: నరసరావుపేట రోడ్డు వైపు నుంచి వస్తున్న ఆ కారు ఇంకొద్ది సేపట్లో ఇంటికి చేరుకోవాలి. కానీ, విధి ఆ కుటుంబంపై పగబట్టింది. గుంటూరు ఐపీడీ కాలనీకి చెందిన అఖిలేష్ తన తండ్రి హరికృష్ణను ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా కారులో నుంచి పొగలు, మంటలు చెలరేగాయి.
క్షణాల్లో కారులో మంటలు..
క్షణాల్లోనే కారును మంటలు చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పరిస్థితి చేజారిపోయింది. ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధైర్యంగా కారు అద్దాలు పగలగొట్టి ముందు సీట్లో ఉన్న అఖిలేష్‌ను అతికష్టమ్మీద బయటకు లాగి ప్రాణాలతో కాపాడగలిగారు.
కారులోనే సజీవ దహనం..
అయితే, మంటల తీవ్రత అత్యంత భయంకరంగా మారడంతో వెనుక సీట్లో కూర్చున్న తండ్రి హరికృష్ణ వద్దకు వెళ్లడం ఎవరికీ సాధ్యపడలేదు. స్థానికులు కళ్లముందే ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు. దీంతో హరికృష్ణ కారులోనే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ విషాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి మృతి!