ఏపీలో సంక్షేమ పథకాల అమలు విషయంలో తీవ్ర స్థాయి చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ ఈ పథకాలే పార్టీల విజాన్ని డిసైడ్ చేయడం ఇక్కడ ఆసక్తికర అంశం. ఒకరు పెన్షన్ 3 వేలు అంటారు, ఇంకొకరు 4వేలు ఇస్తామంటారు. ఒక పార్టీ ఒక బిడ్డకే అమ్మఒడి అంటుంది, ఇంకో పార్టీ ఎంతమంది బిడ్డలున్నా తల్లికి వందనం ఇస్తామంటుంది. ఒక పార్టీ రైతు భరోసా ప్రకటిస్తుందో, ఇంకో పార్టీ అన్నదాతా సుఖీభవ అంటూ నిధులు పెంచుతామంటుంది. ఇలా ఒకరిని మించి ఇంకొకరు సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతిమంగా ఎవరి వల్ల తమకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందని ఓటరు భావిస్తున్నారో వారికే అధికారం అప్పగిస్తున్నారు. ఈ సంస్కృతి ఏపీని అప్పుల కుప్పలా మారుస్తుందనే అపవాదు ఉంది. అయితే ఈ సంక్షేమ పథకాల అమలు తీరు, వాటికోసం చేస్తున్న అప్పులపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వివరణ ఇచ్చారు.
సంక్షేమం లేనిదే మనుగడ లేదు..
సంక్షేమ పథకాల అవసరం, అమలుపై ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా సంక్షేమం లేకుండా మనుగడ సాగించలేవని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమంతోపాటు సంస్కరణలు కూడా దేశానికి అవసరమేనన్నారు. సంస్కరణల వల్లే పోర్టులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారుల ఏర్పాటు జరుగుతోందని.. టెలి కమ్యూనికేషన్లు, విద్యుత్తు ప్రాజెక్టులు, విద్యా విధానంలో విపరీతమైన మార్పులు వచ్చాయని చెప్పారు.
అంతరం తగ్గించడానికే..
సమాజంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతరం రోజు రోజుకీ పెరిగిపోతోందని, దాన్ని తగ్గించడంలో భాగంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. అయితే సంపద సృష్టించే వారికే సంక్షేమ పథకాలను అమలు చేసే హక్కు ఉంటుందన్నారు. కేవలం అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయలేమని, అది ఆర్థిక వినాశనానికి దారి తీస్తుందని పరోక్షంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రానికి సంపద సృష్టించి, ప్రజలను పేదరికంలో ఉంచడం కూడా సరికాదన్నారు. అందుకే ముందు సంపద సృష్టిపై దృష్టిపెట్టామని, సంక్షేమాన్ని కూడా దానికి సమాంతరంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
సో.. సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం చంద్రబాబుకి ఓ క్లారిటీ ఉంది. సంక్షేమం పేరుతో ఆయన రాష్ట్ర నిధుల్ని దుబారా చేస్తున్నారని, కొత్త అప్పులు తెస్తున్నారని విమర్శించేవారికి ఇదే ఆయన జవాబు అనుకోవాలి. వైసీపీ హయాంలో సంపద సృష్టి జరగలేదనేది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. మూడు రాజధానుల పేరుతో అమరావతిలో జరిగే అభివృద్ధిని కూడా అడ్డుకున్నారని, రాష్ట్రానికి వచ్చే కంపెనీలను వెనక్కి తరిమేశారని, నిరుద్యోగ సమస్యను మరింత జఠిలం చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఆ తప్పులన్నీ సరిదిద్దుతున్నామని అంటున్నారు. సంక్షేమం విషయంలో తమది పైచేయి అని కూటమి ఇప్పటికే నిరూపించుకుంది. పెన్షన్లు పెంచింది, తల్లికి వందనం రెట్టింపు స్థాయిలో అమలు చేస్తోంది, అన్నదాత సుఖీభవకు కూడా నిధులు పెంచింది. అయితే సంక్షేమంతోపాటు సంపద సృష్టి కూడా ఆ స్థాయిలో జరుగుతుందో లేదో వేచి చూడాలి.