Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేయాలని కేంద్రం ప్రభుత్వం, దాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అధికార ఎన్డీఏ కూటమిలో కీలక పార్టనర్‌గా టీడీపీ ఈ బిల్లుకు సంబంధించి కేంద్రానికి కీలక మార్పులను సూచించింది. మొత్తం 4 మార్పులను సూచించగా.. అందులో బీజేపీ మూడింటిని ఆమోదించింది.
ప్రస్తుతం అమలులో ఉన్న వక్ఫ్ బోర్డు చట్టంలో వక్ఫ్ బై యూజర్ అనే ఓ క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ప్రకారం ఎవరైనా ఒక ఆస్తిని దానం చేస్తే.. ఆ ఆస్తికి సరైన పత్రాలు లేకపోయినా అది వక్ఫ్ బోర్డుకు కిందకే వస్తాయి. ఇప్పుడు కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లులో ఈ క్లాజ్ తీసేయాలని ఉంది. వక్ఫ్ బోర్డుకు దానం ఇస్తున్న మెజారిటీ ఆస్తులకు సరైన పత్రాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే.. సరైన డాక్యూమెంట్స్ లేని ఆస్తులను వక్ఫ్ బోర్డు పరిధి నుంచి తొలగించాలని కేంద్రం ఆలోచన.
పత్రాలు ఉన్నా.. లేకపోయినా.. ఇలా విరాళంగా వచ్చిన ఆస్తిని మసీదులు, శ్మశానవాటికలు, మదర్సాలు, అనాథాశ్రమాల నిర్వహణకు వినియోగిస్తున్నారు కాబట్టి వాటిని బోర్డు పరిధి నుంచి తొలగించొద్దని ముస్లిం సంఘాల డిమాండ్. టీడీపీ కూడా ఇదే ప్రతిపాదన చేసింది. వక్ఫ్ బై యూజర్ అనే క్లాజ్ ను తొలగించొద్దని కేంద్రాన్ని కోరింది. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా నమోదైన తర్వాత సంబంధిత పత్రాలు లేకున్నా దానిని వక్ఫ్ ఆస్తిగానే పరిగణించాలని తెలిపింది. టీడీపీ తెలిపిన ఈ మొదటి సవరణను కేంద్రం అంగీకరించింది.
ఇక కొత్తగా తీసుకొస్తున్న బిల్లులో వక్ఫ్ వివాదాలకు సంబంధించిన కేసుల్లో ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తి అవుతుందా? లేకా అది ప్రభుత్వానికి చెందుతుందా? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారిదే ఫైనల్ డెసిషన్ అని ఉంది. దీన్ని కూడా ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ అధికారి ప్రభుత్వానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి.. తమ ఆస్తులు ప్రమాదంలో పడపతాయని ముస్లిం సంఘాల ఆందోళన. టీడీపీ కూడా వారి భయాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రానికి ఈ విషయంలో కీలక సూచనల చేసింది. కలెక్టర్‌కు తుది అధికారం ఉండద్దొని సూచించింది. కేంద్రం దీనికి కూడా ఓకే చెప్పింది.
ఇక వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి డిజిటల్‌గా పత్రాలు సమర్పించేందుకు ఆరు నెలల గడువు పొడిగించాలని కోరింది. దీనికి కూడా కేంద్రం అంగీకరించింది. ఈ మూడు ప్రతిపాదనలు అమలు చేస్తే ముస్లింలలో ఉన్న అభద్రతా భావం పోతుందని బీజేపీ కూడా భావిస్తోంది.
Also Read: పాస్టర్ మృతి కేసు.. మాజీ ఎంపీ హర్ష కుమార్‌కు పోలీసులు నోటీసులు
టీడీపీ సూచించిన నాలుగో ప్రతిపాదననను మాత్రం బీజేపీ వ్యతిరేకించింది. వక్ఫ్ ఆస్తులలో ముస్లిమేతరుల ప్రమేయాన్ని నిరోధించాలని టీడీపీ సూచించింది. దానికి ఓ వివరణ కూడా ఇచ్చింది. హిందూ దేవాలయాల విషయంలో ఇతర మతస్తుల ప్రమేయాన్ని ఎలా అయితే.. అంగీకరించడం లేదో.. ముస్లింల మత వ్యవహారాల్లో కూడా ముస్లిమేతరుల జోక్యం ఉండకపోతే మంచిదని టీడీపీ వాదన. ఇప్పుడే కాదు.. మొదటి నుంచీ టీడీపీ ఇదే వాదనను బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ విషయంలో ముస్లిం సమాజం కూడా గట్టిగా పోరాడాలని సూచించింది. కానీ.. కేంద్రం మాత్రం ముస్లిమేతరుల జోక్యం విషయంలో వెనక్కి తగ్గడం లేదు.
నాలుగు సవరణల్లో మూడింటిని కేంద్రం ఆమోదించినందుకు టీడీపీ ఎంపీలు హర్షం వ్యక్తంచేశారు. అటు.. వైసీపీపై విమర్శలు కూడా చేశారు. ముస్లింల విషయంలో వైసీపీ రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ముస్లింలను రెచ్చగొడుతున్న వైసీపీ… వక్ఫ్ బిల్లు విషయంలో ఒక్క సవరణ కూడా ఎందుకు ప్రతిపాదించలేదని టీడీపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.