CM Jagan comments on TDP Alliance(AP politics): కూటమికి ఓటు వేస్తే ఐదేళ్ల పాటు అందుతున్న పథకాలకు ముంగిపు పలికినట్లేనని సీఎం జగన్ అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్లేనని ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి చివరిరోజు సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంటింటి అభివృద్ధి జరగాలంటే మళ్లీ వైసీపీనే గెలిపించాలని ప్రజలను సీఎం జగన్ కోరారు. గతంలో ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను కూటమి నేతలు చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మోసాలే చేశారని.. అది చంద్రబాబు చరిత్ర ఎలాంటిదో చెబుతుందని జగన్ ఆరోపించారు.
‘2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 2 లక్షల 71 వేల కోట్లు రూపాయలను ప్రజలు ఖాతాల్లో వేశాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించి.. 99 శాతం హామీలను అమలు చేశాం. మహిళల పేరు మీద ఏకంగా 31 లక్షల ఇళ్లు ఇచ్చాం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచిపని గుర్తుకు రాదు. అధికారంలోకి వచ్చే వరకు అబద్ధాలు.. అధికారంలోకి వచ్చాక అన్నీ మోసాలే. విద్యారంగంలో వచ్చిన మార్పులను గతంలో ఎప్పుడైనా చూశారా? పేదవాళ్ల కోసం చంద్రబాబు ఒక్క మంచి స్కీమ్ అయినా తెచ్చారా? మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా?.. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను నమ్మెచ్చా? 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా? రుణమాఫీ, మహాలక్ష్మి పథకం, ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఇచ్చారా?’ అంటూ టీడీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మంగళగిరిలో పవన్ కళ్యాణ్, రిషికొండలో బాలకృష్ణ భూములు కొన్నారు. ఆ జిరాక్స్ కాపీలు ఇచ్చారా. దత్తపుత్రుడిని మహిళలను నమ్మే ప్రసక్తి ఉందా.. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు అందించే పెన్షన్ కు ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. ఇతర ప్రభుత్వ పథకాలను అడ్డుకున్నారు’ అని సీఎం జగన్ విమర్శించారు.