తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ పనితీరు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్మించిన నూతన కార్యాలయం అద్భుతంగా ఉందని.. ఇది పోలీసుల పనితీరును మరింత మెరుగుపరచడానికి దోహదపడుతుందని ఆకాంక్షించారు.
భక్తుల రక్షణే ప్రథమ కర్తవ్యం..
ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని సీఎం స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ ప్రాంతంలో ప్రజలు, భక్తులు సురక్షితంగా ఉన్నామనే భావన (Sense of Safety) కలగాలని ఆయన పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో తిరుపతి పోలీసులు ప్రదర్శిస్తున్న చొరవను ఆయన అభినందించారు.
రాజకీయ ముసుగులో రౌడీయిజం సాగనివ్వం..
గత ఐదేళ్ల పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా భ్రష్టు పట్టాయని సీఎం విమర్శించారు. రాజకీయాల పేరుతో రౌడీయిజం చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఇకపై సాగదని హెచ్చరించారు. ‘అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపడానికి వెనకాడము. రౌడీయిజం చేసేవారికి రాష్ట్ర బహిష్కరణ తప్పదు’ అని ఆయన కరాఖండిగా చెప్పారు. సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడే వారి పట్ల ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు.
నేరస్తుల డ్రామాలకు తావు లేదు..
వివేకా హత్య కేసు వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. నేరం చేసిన వారు ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కానీ నేరస్తులు ఎన్ని డ్రామాలు ఆడినా ఏదో ఒక చోట దొరికిపోక తప్పదని చంద్రబాబు అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టుల ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
టెక్నాలజీతో స్మార్ట్ పోలీసింగ్..
నేర నియంత్రణలో టెక్నాలజీ పాత్ర కీలకమని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. డ్రోన్ పెట్రోలింగ్ పెంచాలని, దృశ్య ఆధారాల ద్వారా నేరస్తులను కట్టడి చేయాలని సూచించారు. ‘ఇన్విజిబుల్ పోలీసింగ్ – విజిబుల్ పోలీస్’ నినాదంతో ముందుకు వెళ్లాలని, నేరం జరిగిన తర్వాత స్పందించే తీరులో మార్పు రావాలని కోరారు. రాబోయే వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ALSO READ: Lucknow Flower Pots: పీఎం ప్రోగ్రామ్ అవ్వగానే.. క్షణాల్లో పూల కుండీలు మాయం.. వీడియో వైరల్