AP New Scheme: ఏపీలో కొత్త స్కీమ్ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకై అర్హులను గుర్తించే ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధానంగా పేదప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఇంతకు ఈ పథకం ఏమిటి? పథకంతో కలిగే ప్రయోజనం ఏమిటి? అర్హులను ఎలా గుర్తిస్తారో తెలుసుకుందాం.
ఏపీలో సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు సిఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రజల ఆర్థిక ఉన్నతి కోసం సరికొత్త నిర్ణయాలను తీసుకొని, వాటిని అమలు చేయడంలో ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సీఎం అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలలో ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం పథకం 2.0 అమలు చేశారు. త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.
అంతేకాకుండా విద్యార్థులకు మేలు చేకూర్చేలా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ. 15 వేలు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. అంతేకాకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే అధికారంలోకి రావడం రావడమే పింఛన్ పెంచి వృద్దులు, వికలాంగులుమ వితంతువులకు, కిడ్నీ వ్యాధి గ్రస్థులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఇలా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా సరికొత్త స్కీమ్ ను అమలు చేయనుంది.
ఆ స్కీమ్ ఏమిటంటే?
ఏపీలో అమలు చేసే సరికొత్త స్కీమ్ పీ4. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ అని దీని అర్థం. ఇప్పటికే లబ్దిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే కూడా ప్రారంభించింది. అసలు పథకం ఉద్దేశం ఏమిటంటే.. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ది పనుల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడమే. ప్రాజెక్టులైనా లేక ఏ ఇతర కార్యక్రమాల్లోనైనా ప్రజలు భాగస్వామ్యం కావచ్చు. ప్రాజెక్ట్ల నిర్మాణంలో పెద్ద పెద్ద సంస్థలతో పాటు ప్రజలు కూడా పెట్టుబడులు పెడితే, వారికి ఆ లాభాల్లో వాటాను ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం ద్వారా ఎందరో ప్రజలకు ఆర్థిక లాభాలు చేరువ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. తక్కువ పెట్టుబడితో పథకంలో అర్హులైన వారికి అధిక లాభాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలైతే ఎన్నో పేద కుటుంబాలు ఆర్థిక చేయూత అందుకున్నట్లే.
స్కీమ్ ప్రారంభం ఎప్పుడు? సర్వే తీరు ఏమిటి?
పీ4 స్కీమ్ ను అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఉగాదికి స్కీమ్ ను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. అప్పటిలోగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 16 జిల్లాల్లో ఇప్పటికే సర్వే ప్రారంభం కాగా, మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20% పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. ఈ సర్వేలో భాగంగా 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Janasena Party: జనసేన వినూత్న కార్యక్రమం.. బొట్టు పెట్టి మరీ..
లబ్దిదారులు వీరే..
పీ4 కార్యక్రమం అమలు చేయనున్న ప్రభుత్వం సచివాలయాల డేటా, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభ ద్వారా లబ్ధిదారులను గుర్తించనుంది. 2 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి, ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయర్స్, ఫోర్ వీలర్స్ ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వాడేవారు ఈ స్కీమ్ కు అర్హులు కారు. ప్రస్తుతం హౌస్ హోల్డ్ సర్వే చేస్తుండగా, మార్చి 18 నాటికి సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని చెప్పవచ్చు.
అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేపడుతున్నామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముందుగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ స్కీమ్ తో రాష్ట్ర ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి, లాభాలు ఆర్జించే అవకాశం పేదల చెంతకు చేరుతుందన్నమాట.