Rayachoti Terrorist Attack: రాయచోటి ఉగ్రవాదుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 1995 తమిళనాడు పేలుళ్ల తర్వాత రాయచోటిలో మకాం వేశారు ఈ ఉగ్రవాదులు. ఉగ్రవాది అబూబకర్ సిద్దిఖీ అలియాస్ అమానుల్లా కిరాణా దుకాణం ముసుగులో ఉంటూ.. ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మరొక ఉగ్రవాది మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ చీరల వ్యాపారం కొనసాగించేవాడు. వీరిద్దరూ కలిసి రాయచోటి నుంచి ఉగ్ర కార్యకలాపాలకు స్కెచ్ వేశారు. వివిధ మార్గాల్లో పేలుడు సామాగ్రిని సేకరించి… ఇంట్లోనే బాంబులు తయారు చేశారు. వీరిద్దరిని కేరళకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఉగ్రవాదుల కుటుంబ సభ్యుల విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఇంట్లో ఎక్కువగా తమిళం మాట్లాడుకునే వాళ్లని తెలిసింది. అంతేకాకుండా కేరళ, తమిళనాడులో ఇద్దరు ఉగ్రవాదులపై 30కి పైగా కేసులు నమోదు అయ్యాయి.
నిందితులు రాయచోటి నుంచి పలుమార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వీరిని అలూ ఉమ్మా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా నిర్ధారించారు. ఉగ్రవాదుల నివాసాల్లో తనిఖీలు చేపట్టగా.. భారీగా పేలుడు పదార్ధాలు లభ్యమయ్యాయి. వీరి వద్ద లభించిన బాంబుల సామాగ్రితో దాదాపు 30 బాంబులను తయారు చేయవచ్చు. 100 మీటర్ల పరిధిలో కూడా ప్రభావం చూపగల బాంబులు లభ్యమయ్యాయి. వీటిని ఆక్టోపస్ బలగాలు నిర్వీర్యం చేశాయి. పలు భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాయచోటిలోని ఉగ్రవాదుల నివాసాల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. వారి కాల్ డేటాతో పాటు, అల్ ఉమ్మా ఉగ్ర సంస్థ లింకులపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: జిన్‌పింగ్ జంప్? చైనా అధ్యక్షుడు అతడేనా?
ప్రస్తుతం తమిళనాడు జైలులో ఉన్న నిందితులను తీసుకొచ్చి విచారించడానికి సన్నాహాలు చేస్తున్నాం. భవిష్యత్తులో భారీ విధ్వంసం చోటుచేసుకోకుండా భగ్నం చేశాం అని తెలిపారు. ఉగ్రవాదులిద్దరిదీ తమిళనాడు రాష్ట్రం, వారిపై రాయచోటి పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. అబూబకర్ సిద్దిఖీ అలియాస్ అమానుల్లా, ఆయన భార్య సైరాబానుతో పాటు షేక్ మాన్సూర్ అలీ, ఆయన భార్య షమీంపై ఉపా యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం, ఆర్మ్‌డ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఉగ్రవాదుల భార్యలను అరెస్టు చేసి రాయచోట కోర్టులో హాజరుపర్చారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.