Indian Railways: దసరా వచ్చేసింది. ఇక బస్టాండ్లు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. అయితే ఎక్కువగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతారు. దీనికి ప్రధాన కారణం.. రైలు ప్రయాణం కొంత సునాయాసంగా సాగడమే. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణాన్నే ఇష్టపడతారు. కాగా రైలులో ప్రయాణించే వారు.. ముందుగానే టూర్ ప్లాన్ చేసుకొని, అందుకు తగినవిధంగా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటారు. రిజర్వేషన్ లో సీటు దక్కించుకుంటే చాలు.. ఇక ఆ సీటు మనదే అన్న ధీమా సైతం ప్రయాణికులకు కలుగుతుంది. అందుకే ఇటీవల రైల్వే రిజర్వేషన్స్ సంఖ్య సైతం పెరిగిందని చెప్పవచ్చు.
తాజాగా రైల్వే శాఖ రిజర్వేషన్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. మనం రిజర్వేషన్ సమయంలో పేరు, అలాగే పూర్తి వివరాలు నమోదు చేస్తాం. అత్యవసర సమయంలో రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకోలేని స్థితిలో.. మనం వేరే వారికి ఆ సీటు తీసుకోండి అంటూ సలహా ఇస్తాం. ఇక ఇటువంటి వాటికి స్వస్తి పలుకుతూ రైల్వే నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రిజర్వేషన్ చేసుకున్న ఏ ప్రయాణికుడైనా.. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఐడీ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలని రైల్వే సూచించింది. రైల్వే టీటీఈకి తనిఖీ సమయంలో ఖచ్చితంగా గుర్తింపుకార్డును చూపించాలని, అలా చూపించని యెడల రిజర్వేషన్ చేసుకున్నా.. టికెట్ లేనట్లు పరిగణించి జరిమానా విధిస్తామని రైల్వే అధికారులు హెచ్చరించారు.
Also Read: Indian Railway: ఈ రైల్ కోచ్‌లు ఏంటి భయ్యా ఇంత బాగున్నాయ్.. ఎక్కడో కాదు, మన దగ్గరే!
రైల్వే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యూహాత్మకమైన మార్పు ఉందనే చెప్పవచ్చు. అంటే ఇప్పటి వరకు ఒకరి రిజర్వేషన్ తో ప్రయాణాలు సాగినా.. ఇక అవి చెల్లవు. కారణం రిజర్వేషన్ సమయంలో నమోదు చేసిన వివరాలు.. టీటీఈ అడిగినప్పుడు చూయించిన గుర్తింపు కార్డు వివరాలు ఒకటే కాకుంటే మాత్రం మనకు జరిమానా తప్పదు. అందుకే రిజర్వేషన్ చేసుకున్న ఏ ప్రయాణికుడైనా.. తన వెంట గుర్తింపు కార్డు కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధార్, ఓటర్, పాన్, లైసెన్స్ తదితరాల్లో ఏ ఐడీ కార్డునైనా టీటీఈకి మనం చూపించవచ్చు. దసరా పండుగకై స్వగ్రామాలకు రైలులో ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేసుకున్నారా.. అయితే తప్పనిసరిగా రైల్వే తెచ్చిన ఈ విధానంపై అవగాహన కలిగి ఉండి, గుర్తింపు కార్డు మాత్రం తెసుకు వెళ్ళండి సుమా !
ఇక, పండుగ సీజన్‌లలో రైళ్లలో భారీ సంఖ్యలో ప్రయాణికులు కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రద్దీని చూసి టిక్కెట్లు తీసుకోకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎందరో మనకు కనిపిస్తూ ఉంటారు. పండగల సమయంలో ఇలాంటి టీటీఈలకు ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే రైల్వే ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, సర్‌ప్రైజ్ టిక్కెట్ చెకింగ్ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తామని, టికెట్ లేకుండా ఎవరూ ప్రయాణించవద్దు అంటూ రైల్వే అధికారులు కోరుతున్నారు.