పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడిని యావత్ భారతావని ముక్త కంఠంతో ప్రశంసించింది. ప్రజలంతా జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో భారత సింహనాదాన్ని అభినందిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఒకరకంగా ఇది యుద్ధ సన్నాహకమే అయినా పైక్ పై యుద్ధం జరిగితే భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తున్నారంతా. భారత వ్యూహాన్ని విపక్షాలు సైతం సమర్థిస్తున్న వేళ, వామపక్షాలు మాత్రం యుద్ధం వద్దంటూ శాంతివచనాలు పలకడం ఇక్కడ విశేషం. పాక్ తో భారత్ యుద్ధం చేయడాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సమర్థించదని చెప్పారు ఆ పార్టీ నేత నారాయణ. యుద్ధం వద్దంటూ ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యుద్ధానికి మేం వ్యతిరేకం..
ఉగ్రవాదలుపై దాడిని తాము సమర్థిస్తామని చెబుతూనే పాక్ పై యుద్ధం మాత్రం వద్దంటున్నారు సీపీఐ నారాయణ. ఉగ్రవాదులను హతమార్చడానికే భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుందని, పాక్ పై యుద్ధం చేయడానికి కాదని చెప్పారు. ఉగ్రవాదులను చంపడం మాత్రం న్యాయమేనంటున్నారాయన. ఉగ్రవాదుల నిర్మూలనలో పాకిస్థాన్ కూడా మనకు సహకరించాలంటున్నారు. మన పోరాటం ఉగ్రవాదంపైనే కానీ, పాకిస్తాన్ పై కాదంటున్నారు నారాయణ. ఒకవేళ యుద్ధమే జరిగితే అది ఉగ్రవాదానికి ఊతమిచ్చినట్టవుతుందని లాజిక్ చెబుతున్నారు.
పాక్ ని దెబ్బకొట్టకపోతే ఎలా..?
ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ కి దెబ్బ తగలకుండా, కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే మట్టుబెట్టాలంటే ఎలా. 9 స్థావరాలపై జరిగిన దాడుల్లో ప్రాణ నష్టం జరిగింది, ఉగ్రమూకకు గాయాలయ్యాయి కూడా. గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పాక్ ఆర్మీ అధికారులు పరామర్శించడం గమనార్హం. దీంతో పాక్ కుతంత్రం బట్టబయలైనట్టయింది. అంటే ఉగ్రమూకను ఉసిగొల్పుతోందీ, వారిని పెంచి పోషిస్తోంది కూడా పాకిస్తానేనని తేటతెల్లమైంది. ఇలాంటి సందర్భంలో కూడా మనం ఊరుకుంటే ఎలా..? పాకిస్తాన్ కి నొప్పు తెలియకుండా కేవలం ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఎలా..? పాక్ పై యుద్ధం చేయకుండా ఉగ్రమూకను తుదముట్టించడం ఎలా..? మరి ఇందులో నారాయణ లాజిక్ ఏంటో ఆయనకే తెలియాలి.
కుక్క కాటుకి చెప్పుదెబ్బ..
పహల్గాంలో దాడి చేసింది ఉగ్రవాదులే అయినా ఆ ఉగ్రదాడికి మూలం పాకిస్తాన్. వారికి రక్షణగా నిలిచింది, ఆశ్రయం ఇచ్చింది కూడా పాకిస్తానే. అలాంటప్పుడు మన తక్షణ కర్తవ్యం ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒక్కటే కాదు, పాకిస్తాన్ ని దెబ్బకొట్టడం కూడా. భవిష్యత్తులో మన దేశం జోలికి రావాలన్నా, కాశ్మీర్ లో అలజడి సృష్టించాలన్నా పాక్ వణికిపోవాల్సిందే. అలాంటి భయం ఉండాలంటే పాకిస్తాన్ కి యుద్ధ భయం నేర్పాలి. అంటే కచ్చితంగా అవసరమైతే మనం యుద్ధం చేయాల్సిందే. మరి వామపక్షాల సిద్ధాంతం ఏంటి..? యుద్ధం జరగకూడదు, ఉగ్రవాదం నాశనమైపోవాలి అంటే ఎలా..? పాక్ కి దెబ్బ తగలకుండా, పాక్ కి నొప్పి తెలియకుండా, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించకుండా ఉగ్రమూకల్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా..? ఒకవేళ సాధ్యమైనా.. తిరిగి మళ్లీ పాకిస్తాన్ ఆ సాహసం చేయకుండా ఉంటుందా..? ఈ దశలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మనం మద్దతుగా నిలవాలి, సమర్థించాలి, రణభేరికి సిద్ధమైనా ప్రతి పౌరుడు మద్దతుగా ఉండాలి.