Operation Sindoor Effect: పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత భద్రతా దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడులలో జైషే మహ్మద్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం సర్వనాశనం అయ్యింది. ఎయిర్ స్ట్రైక్స్ లో అతడి కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు చనిపోయారు. మరో నలుగురు అనుచరులు కూడా హతమయ్యారు. మరణించిన వారిలో అజార్ భార్య, సోదరి, బావమరిది సహా మొత్తం 14 మంది చనిపోయారు. బహవల్ పూర్ లోని అజార్ స్థావరంపై జరిపిన దాడుల్లో వీళ్లంతా మరణించారు. వారి అంత్యక్రియలు బహవల్ పూర్ లో జరుగుతాని అక్కడి మీడియా వెల్లడించింది. తన కుటుంబ సభ్యుల మరణాన్ని అజార్ ధృవీకరిస్తూ ప్రకటనను విడుదల చేశారు.
ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాకిస్తాన్ లోని పంజాబ్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు దాడి చేశాయి. జైషే మహ్మద్, లష్కర్-ఏ-తోయిబా ప్రధాన కార్యాలయాలతో పాటు పంజాబ్ లో 4 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. అదే సమయంలో పీఓకేలో 5 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ తెల్లవారు జామున 1 గంటల నుంచి 1.30 గంటల ప్రాంతంలో 9 లక్ష్యాలలోని 21 ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల జరిగినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లోనే మసూద్ అజర్ ఫ్యామిలీలో 10 మంది, మరో నలుగురు మృతి చెందినట్లు పాక్ వీడియా వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ లోని రెండు ప్రధాన దాడుల్లో ఒకటి బహవల్ పూర్ లోని సుభాన్ అల్లా కాంప్లెక్స్ పై జరిగింది. ఈ దాడులు పాకిస్తాన్ సైనిక స్థావరాలపై కాకుండా ఉగ్రవాద శిబిరాలపై జరిగాయని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడుల్లో లష్కరే మత ప్రచారకుడు ఖారీ మొహద్ ఇక్బాల్ కూడా చనిపోయినట్లు తెలిపింది. పౌరులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది.
#OperationSindoor | India says it strikes Bahawalpur, stronghold of Jaish Chief Masood Azhar pic.twitter.com/guHVyZBgGE
— KINS (News Agency) (@indepth_news) May 7, 2025
మసూద్ అజార్ బతికే ఉన్నాడా?
మసూద్ అజార్ భారత్ లో పలు ఉగ్ర దాడులకు సూత్రధారి. 2001లో న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటు దాడికి కర్త, కర్మ క్రియ తనే. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులు కూడా కొద్ది రోజులు ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి మసూద్ అజార్ చాలా నెలలుగా ప్రజలకు కనిపించకుండాపోయాడు. 2024 చివరిలో బహవల్ పూర్‌లో కనిపించాడు. భారతీయ నిఘా సంస్థలు అతడి కదలికలను నిశితంగా పరిశీలించాయి. తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా అతడు రహస్య ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు గుర్తించాయి. అయితే, భారత సైన్యం దాడుల్లో అతడి కుటుంబ సభ్యులు చనిపోగా, వారి మృతదేహాలను తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ దాడిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడైన అజార్ కూడా చనిపోయాడా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కొన్ని మీడియా సంస్థలు దాడి సమయంలో అజార్ అక్కడే ఉన్నట్లు వెల్లడించాయి. ఈ దాడుల్లో అతడు కూడా చనిపోయి ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపాయి. కానీ, ఆయన పేరుతో ప్రకటనలు రావడం అనుమానాలకు తావిస్తోంది. త్వరలోనే అసలు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Also: నిద్రలేచే లోపే లేపేశారు కదయ్యా.. పాకిస్తాన్‌పై పేలుతున్న జోకులు!