తోడల్లుళ్ళు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఆ వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి ఆలింగనం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. పాత పగలు, కోపతాపాలు పక్కనపెట్టి వారిద్దరూ ఒకే వేదికపైకి రావడం ఒక విశేషం అయితే, ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం మరో విశేషం. ఆ హగ్ కి అంత ఎఫెక్ట్ ఉంటుందని తాను అనుకోలేదని, అయితే ఎక్కడికెళ్లినా.. తనను అదే విషయం గురించి అడుగుతున్నారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దగ్గుబాటి.
అందరికీ గుర్తుండిపోయింది..
గతంలో ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీ పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక.. కొత్త ప్రభుత్వంలో తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ప్రాధాన్యత ఇస్తారని అనుకున్నారంతా. కానీ అది ఎందుకో సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి వేరయ్యారు. ఇటీవల కాలం వరకు వారి మధ్య మాటలు లేవు. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా అంతగా లేవు. దాదాపు 30 ఏళ్ల తర్వాత వారిద్దరూ స్టేజ్ పై కలిశారు. ప్రపంచ చరిత్ర అనే పేరుతో దగ్గుబాటి రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆ స్టేజ్ పై తోడల్లుళ్లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అయితే ఈ హగ్ లో కూడా చంద్రబాబు ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు. ఈ 30 ఏళ్ల కాలంలో చంద్రబాబు, తాను కేవలం మూడుసార్లు మాత్రమే కలుసుకున్నామని, నాలుగోసారి స్టేజ్ పైన కలిశామని.. గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుని చంద్రబాబు ఎక్కువ ఎమోషనల్ అయినట్టున్నారని అన్నారు దగ్గుబాటి. అందుకే ఆయన తనను దగ్గరకు లాక్కొని హగ్ చేసుకున్నారని చెప్పారు.
ఊహించని స్పందన..
చంద్రబాబు తనను హగ్ చేసుకోవడం చాలామందిని కదిలించిందని.. వారికి ఆ సన్నివేశం బాగా గుర్తుండిపోయిందని అన్నారు దగ్గుబాటి. జీవితంలో అందరికీ చాలా సమస్యలుంటాయని, వాటిని ఓవర్ కమ్ చేయడానికి ఇదే అసలైన ప్రక్రియ అని వారు అనుకొని ఉంటారని చెప్పారు. అందుకే ఎక్కడికి వెళ్లినా ఆ సన్నివేశం గురించే అడుగుతున్నారని చెప్పారు. అందరికీ అక్కడ చంద్రబాబు యాటిట్యూడ్ నచ్చిందని అన్నారు. ఆ హగ్ కి ఇంత రెస్పాన్స్ వస్తుందని కూడా తాను అనుకోలేదన్నారు. పార్టీకి కానీ, తమ కుటుంబానికి కానీ పెద్దగా సంబంధం లేనివారు కూడా తాను ఎక్కడికి వెళ్లినా ఆ సందర్భం గుర్తు చేస్తున్నారని చెప్పుకొచ్చారు దగ్గుబాటి.
30 ఏళ్లుగా తమ ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా తమ పిల్లలకు మాత్రం ఎలాంటి పరిమితులు పెట్టలేదన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తమ పిల్లలు, చంద్రబాబు తనయుడు లోకేష్ తో మాట్లాడుతుంటారని, ఆ విషయం తమకు తెలిసినా అడ్డు చెప్పేవాళ్లం కాదన్నారు. ఇప్పుడంతా సర్దుబాటు అయిపోయిందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇప్పుడు తోడల్లుళ్లు ఇద్దరు కలసిపోయారు. వారి కుటుంబాలు కూడా కలసిపోయాయి. వారిద్దరి మధ్య మాటలు లేకపోవడంతో ఇన్నాళ్లూ సతమతం అయిన అక్క చెల్లెళ్లు పురంధరేశ్వరి, భువనేశ్వరి కూడా ఇప్పుడు ఒక్కటయ్యారు. మొత్తానికి నందమూరి ఫ్యామిలీ అంతా మళ్లీ ఒక్కటైనట్టు స్పష్టమవుతోంది.