Tirumala: టీటీడీలో సెక్యూరిటీ సిబ్బంది డొల్లతనం మరోసారి బయటపడింది. ఆలయం మహాద్వారం వరకు భక్తులు చెప్పులతో వచ్చినా అధికారులు, సిబ్బందికి కాన రాలేదు. మహాద్వారం దగ్గరున్న సిబ్బంది చూడటంతో భక్తులు ఆ చెప్పులను విడిచి లోపలకి వెళ్లారు. వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చిన వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా లోపలికి వస్తారు. కాంప్లెక్స్‌లో మూడు చోట్ల తనిఖీలు జరుగుతాయి. ఒక దగ్గర పొరపడినా.. మరో దగ్గరైన భక్తులు చెప్పులుతో వెళ్తున్న విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించాలి. కానీ.. అలా జరగలేదంటే.. వారు ఎంత అప్రమత్తంగా ఉన్నారో అర్థం అవుతోంది. ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సెక్యూరిటీలో ఎవరున్నారు అనే వివరాలు ఇవ్వాలని విజిలెన్స్ ఉన్నతాధికారి ఆదేశించారు.
తిరుమలలో మరోసారి భద్రతాలోపం బయటపడిందన్నారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. మహాద్వారం వరకు పాదరక్షలతో వస్తే ఎవరికీ కన్పించలేదా అని ప్రశ్నించారు. టీటీడీ పాలకమండలి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల కొండపై జరుగుతున్న అపచారాలు గురించి చెప్తుంటే వితండ వాదనలు చేస్తున్నారు. తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయని భూమన ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేదు. చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు ఏనాడు రాలేదు.
కాగా గోశాలలో ఆవులు చనిపోయాయన్నది నిజమని, అందుకు ఆధారాలు ఉన్నాయని భూమన అన్నారు. పూడ్చిన కళేబరాలను జేసీబీలతో తవ్వితీద్దామని సవాల్ చేశారు. తిరుమల గోశాలలో వందకు పైగా గోవులు మరణించాయన్న భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలను టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు ఖండించారు. భూమన కరుణాకర్ రెడ్డి అవే ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు. వందకు పైగా గోవులు చనిపోయినట్టు నిరూపిస్తే తాను టీటీడీ బోర్డు సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఒకవేళ రుజువు చేయకపోతే భూమన శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు ఎంఎస్ రాజు. గోశాలలో ఆవులు చనిపోయాయని భూమన కరుణాకర్‌రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. భూమన గోశాలకు వచ్చి నిరూపించాలని ఆయన ఛాలెంజ్ విసిరారు. భూమన అసత్యాలను ప్రచారం మానుకోవాలని, లేకపోతే లీగల్‌గా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా అంటూ ఫైర్ అయ్యారు.
Also Read: పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ డెత్.. ఇవిగో ప్రూఫ్స్.. తేల్చి చెప్పిన ఐజీ
మరోవైపు తిరుపతి గోశాలలో వందల ఆవులు మృతి చెందాయని ఆరోపించిన భూమన కరుణాకర్ రెడ్డిపై మంత్రి ఆనంరామనారయణ రెడ్డి ఆగ్రహం వ్యక్త చేశారు. ఒంటిమిట్ట ఆలయంలో సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న అంశాన్ని డైవర్ట్ చేయడానికే ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారని అన్నారు ఆనం. హైందవ ధర్మం గురించి వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారాయన. గత ఐదేళ్లలో జగన్ ఎన్ని సార్లు సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు.