ఆమె పేరు దివ్య. రెండు నెలల క్రితం ఆమెకు ఓ పాప పుట్టింది. తల్లిపాల విలువ తెలిసిన మాతృమూర్తి దివ్య.. తన పాపకు సరిపోగా మిగిలిన పాలను మదర్ మిల్క్ బ్యాంక్ కి దానం చేస్తోంది. 250 మిల్లీలీటర్ల చొప్పున 25 ప్యాకెట్ల పాలను జాగ్రత్తగా నిల్వ చేసింది. తల్లిపాలు తక్కువగా ఉన్న ఇతర బిడ్డల ఆకలి తీర్చేందుకు ఆ పాలను దానం చేసింది.
మదర్ మిల్క్ బ్యాంక్..
పుట్టగానే బిడ్డ ఆకలి తీర్చేది తల్లిపాలు. బిడ్డ పుట్టాక కొంతమంది తల్లులకు వెంటనే పాలు వస్తాయి, మరికొందరికి మాత్రం అవి సరిపడినంతగా రావు. వాటితో బిడ్డ ఆకలి పూర్తిగా తీరదన్నమాట. అలాంటి సందర్భాల్లో దగ్గర్లో ఎవరైనా డెలివరీ అయిన మహిళలు ఉంటే వారిని సంప్రదించాల్సి ఉంటుంది. పాతరోజుల్లో ఇదంతా సహజం ఒకవేళ తల్లికి పాలు పడకపోతే.. బంధువుల్లో ఎవరైనా బాలింతలు తమ బిడ్డతోపాటు ఆ బిడ్డకు కూడా పాలుపట్టేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు, ఒకవేళ ఉన్నా సవా లక్ష అనుమానాలు. అయితే పురిటి బిడ్డల పాలకోసం ఇప్పుడు మదర్ మిల్క్ బ్యాంక్ లు వచ్చేశాయి. తల్లిపాలను నిల్వ చేస్తూ అవసరం ఉన్నవారికి వాటిని అందిస్తున్నాయి. విజయవాడలో ఆధ్రా హాస్పిటల్స్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి మదర్ మిల్క్ బ్యాంక్ ఉంది. ఈ మిల్క్ బ్యాంక్ కి దివ్య తన పాలను డొనేట్ చేశారు. నెలలు నిండకుండా పుట్టే బిడ్డలకు, నియోనాటల్ ఐసీయూలో వైద్యుల సంరక్షణలో ఉండే బిడ్డలకు ఈ మిల్క్ బ్యాంక్ నుంచి పాలను అందిస్తుంటారు.
ఈ ఆలోచన ఎలా వచ్చింది..?
దివ్యకు నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే అవకాశం ఉందని ఓరోజు డాక్టర్ చెప్పారు. ఒకవేళ తనకు ప్రీ మెచ్యూర్డ్ బేబీ పుడితే, అప్పుడు పాలు ఎలా పట్టాలి అని ఆమె ఆందోళన చెందారు. అప్పుడే తల్లి పాలకోసం ఆమె ఇంటర్నెట్ లో వెదికారు. మదర్ మిల్క్ బ్యాంక్ నుంచి తెలుసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆమెకు నెలలు నిండిన తర్వాతే బిడ్డ పుట్టింది. పాలు కూడా సరిపడా వచ్చేవి. కొన్నిరోజుల తర్వాత బిడ్డకు సరిపోగా తనకు పాలు మిగిలిపోతున్నాయని అనిపించింది. వెంటనే డాక్టర్ ని సంప్రదించారు. పాత రోజుల్లో అయితే ఇలా వచ్చిన పాలను వృథాగా పడేసేవారు. కానీ అప్పటికే ఆమెకు మదర్ మిల్క్ బ్యాంక్ గురించి తెలిసి ఉండటంతో తన తల్లి, భర్తని సంప్రదించి అదనంగా వచ్చే పాలను మిల్క్ బ్యాంక్ కి డొనేట్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 25 ప్యాకెట్లను ఆమె ఇలా డొనేట్ చేశారు.
ఎలా సేకరిస్తారు..?
సహజంగా బిడ్డలు నేరుగా తల్లిపాలు తాగుతారు. ఉగ్గు పోసే సమయంలో తల్లిపాలను కాస్త కలిపేందుకు సహజ పద్ధతుల్లోనే తీసుకుంటారు. మరి ప్యాకెట్ లో పాలు నింపాలంటే దానికి ఓ పద్ధతి ఉంది. బ్రెస్ట్ పంప్ లను ఉపయోగించి తల్లిపాలు సేకరిస్తారు. ఈ బ్రెస్ట్ పంప్ ల ద్వారా పాలను బాటిల్ లో సేకరించి వాటిని ప్యాకెట్ లో నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసిన పాలను తక్కువ ఉష్ణోగ్రత వద్ద డీప్ ఫ్రిడ్జ్ లో ఉంటే కొన్ని నెలల వరకు అవి పాడవకుండా ఉంటాయి. అలా బ్రెస్ట్ పంప్స్ ఉపయోగించి దివ్య తన పాలను తీసి ప్యాకెట్లలో నిల్వ చేశారు. అత్యంత పరిశుభ్రంగా బ్రెస్ట్ పంప్స్ ని వాడాలని చెబుతున్నారు దివ్య.
మదర్ మిల్క్ బ్యాంక్ వాళ్లు సేకరించిన పాలను ముందుగా పరీక్షిస్తారు. అలా సేకరించడానికి ముందే తల్లి ఆరోగ్య పరిస్థితిని కూడా వారు నిర్థారించుకుంటారు. పాలను అన్ని విధాలుగా పరీక్షించి ఆ తర్వాత తమ మిల్క్ బ్యాంక్ లో నిల్వ చేస్తారు. అవసరం ఉన్న వారికి వాటిని అందిస్తారు.
కుటుంబ మద్దతు..
సహజంగా ఇలాంటి విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా అవసరం. ఇక్కడ దివ్య భర్త జయేంద్ర కశ్యప్ కూడా ఆమెను ఈ విషయంలో ప్రోత్సహించారు. దివ్య తల్లి కూడా ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను ఈ డొనేషన్ చేపట్టానని అంటున్నారు దివ్య. తాను పాలు డొనేట్ చేస్తున్న విషయానికి ప్రచారం రావాలని కోరుకోవడం లేదని, అయితే తనని చూసి ఎవరైనా ఇలాంటి పద్ధతుల్లో పాలు డొనేట్ చేస్తే అది తనకు సంతోషాన్నిస్తుందని అంటున్నారు దివ్య. అందుకే మదర్ మిల్క్ బ్యాంక్ గురించి ఆమె మరింత అవగాహన కల్పిస్తున్నారు. తల్లిపాలు అందని చిన్నారులకు దివ్య తల్లిగా మారారు. అమ్మతనానికి అసలైన అర్థం చెప్పారు.