Vote Festival in Telugu States(Telugu news live) : బస్సులు, ట్రైన్లు ఫుల్.. పట్టణాలన్నీ ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో స్థిరపడిన తెలుగువారంతా.. సొంతూళ్లకు బయల్దేరుతున్నారు. ఇదంతా చూస్తుంటే సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది కదూ. ఇప్పుడు కూడా పండగే వస్తోంది. అదే మన ఓట్ల పండుగ. ఐదేళ్లకు ఒకసారి వచ్చే పండుగ. ఓటు అనే ఆయుధంతో మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే ప్రజాస్వామ్య పండుగ.
ఏపీ, తెలంగాణల్లోని సొంతూళ్లకు ప్రజలంతా క్యూ కట్టడంతో.. బస్సులు, ట్రైన్లు ఫుల్ అవుతున్నాయి. ఆర్టీసీ ఖాళీలేక ట్రావెల్స్ బస్సుకైనా వెళ్లానుకున్న వారికి చుక్కలే కనిపిస్తున్నాయి. సంక్రాంతి, దసరా పండుగల సమయంలో ఉండే టికెట్ల ధరలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఒక్కో టికెట్ ధర రూ.2000 కు తక్కువ లేదు. ఇక ట్రైన్లతే సరే సరి. చాంతాడంత వెయిటింగ్ లిస్ట్.. కొన్ని ట్రైన్లకు అది కూడా ఫుల్ అయ్యి రిగ్రెట్ కూడా అయ్యాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
Also Read : ఎన్నికల వేళ మద్యం ప్రవాహం, పుష్ప ఫిల్మ్ మాదిరిగా, గోవా టు విజయవాడ
ఏదేమైనా సరే సొంతూరికి వెళ్లి ఓటెయ్యాలని సొంత వాహనాల్లోనూ ఊళ్లకు బయల్దేరుతున్నారు. దీంతో సంక్రాంతి పండక్కి టోల్ ప్లాజాల వద్ద దర్శనమిచ్చే ట్రాఫిక్ జామ్ ఇప్పుడు కూడా కనిపిస్తోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
కొందరు టికెట్ల ధరలు, వెయిటింగ్ లిస్టులు చూసి ఏం ఓటేస్తాంలే అని ఆగిపోతున్నారు. కానీ.. ఒక్క ఓటు మీ ఐదేళ్ల జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ ఒక్క ఓటే రాష్ట్ర భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఓటు వేయకపోతే.. అభివృద్ధిని ఆపివేసినట్లే. ఎంత కష్టమైనా.. ఎంత ఖర్చైనా.. ఓటు వేయండి. మీ ఓటుతో మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోండి. బాధ్యత గల పౌరులుగా మెలగండి.