Drugs in AP: దేశ భవిష్యత్తుకు నావికులుగా మారాల్సిన యువతరం.. ప్రమాదకర రీతిలో మత్తువైపు మొగ్గుతోంది. సరదాగా గంజాయి పట్టి ఓ దమ్ము లాగుతున్న వాళ్లు.. ఆ తర్వాత దాన్ని వదల్లేక మత్తు మాయలో చిత్తు అవుతున్నారు. తమ ఆరోగ్యాలనే కాక చేతి ఖర్చుల కోసం ఇస్తున్న డబ్బును.. డ్రగ్స్ కొనుగోళ్లకు వినియోగిస్తున్నారు. కొన్ని సందర్భాలలో మత్తుమందు అక్రమ రవాణా చేస్తూ దొరికిపోతున్నారు. కఠినమైన మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కుపోతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది యువత జీవితాలను దారితప్పిస్తున్న మత్తు మాఫియా ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా కోట్ల కొద్ది వ్యాపారాన్ని నిర్వహిస్తూ.. దేశంలోని ఇతర ప్రాంతాలకు డ్రగ్స్‌ను తరలిస్తోంది.
తాజాగా కృష్ణా జిల్లాలో ఐసిస్ డ్రగ్ కలకలం రేపుతోంది. ఐసిస్, బోకోహరమ్ లాంటి ఉగ్రసంస్థలు ఉపయోగించే డ్రగ్.. ఇప్పుడు విజయవాడ పరిసరాల్లో మెడికల్ షాపుల్లో సులువుగా లభ్యమవుతుంది. ఈ విషయాలన్ని ఆపరేషన్ గరుడలో బయటికి వచ్చాయి. ఐసిస్ డ్రగ్‌గా పేరొందిన ట్రెమడాల్ అనే సైకోట్రోపిక్ సబ్‌స్టెన్స్‌ను కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఓ మెడికల్ షాపులో అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించగా.. సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
ఒకటో, రెండో కాదు.. 2022-23, 2023-24 సంవత్సరాల్లో ఈ ఒక్క షాపులోనే 55 వేల 961 ట్రెమడాల్ ట్యాబెల్ట్స్, 2 వేల 794 ఇంజెక్షన్లు విక్రయించారు. అవనిగడ్డలోని భార్గవ మెడికల్ స్టోర్స్‌లో ఈ మాదకద్రవ్యాల రాకెట్ జరుగుతున్నట్టు గుర్తించారు. అలసట, నిద్ర రాకుండా ఉండటానికి, ఎక్కువ సమయం ఉత్తేజంగా పనిచేయటానికి ఐసిస్, బోకోహరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు.. ఈ ట్రెమడాల్ మాత్రలను అందిస్తుంటాయి. అందుకే వీటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ డ్రగ్‌గా, ఫైటర్ డ్రగ్‌గా పేరుంది.
ట్రెమడాల్ తయారీ, వినియోగంపై 2018లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు, నియంత్రణలు విధించింది. అంతేకాదు NDPS చట్టపరిధిలోకి వీటిని తీసుకొచ్చింది. అనుమతించిన పరిమాణం, కాంబినేషన్‌లో మాత్రమే తయారు చేసి వైద్యుల సూచనలతో విక్రయించాలి. కానీ అధికారుల తనిఖీల్లో ఇప్పుడీ విషయాలన్ని బయటికి వచ్చాయి. అంతేకాదు రికార్డుల్లో ఉన్నదానికి మించి మాత్రలు విక్రయించి ఉంటారని అనుమానిస్తున్నారు.
Also Read: తప్పిస్తాడా.. లైట్ తీసుకుంటాడా.. శ్యామలపై జగన్ నిర్ణయం ఏంటి?
భార్గవ మెడికల్ స్టోర్స్ యజమాని కొనకళ్ల రామ్మోహన్‌ను ప్రశ్నించగా.. చాలా కాలంగా ఈ మాత్రలు, ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే అవనిగడ్డ పరిసర ప్రాంతంలో అనేక మంది ఆయన ఈ మత్తు పదార్థానికి బానిసలుగా మార్చినట్లు ఈగల్ విభాగం గుర్తించింది. ఈ ఐసిస్ డ్రగ్‌పై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వీలుగా కొనకళ్ల రామ్మోహన్‌పై NDP చట్టం కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.