Ap School Timings: ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల పని సమయాలను మార్చాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం అన్ని ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుండగా.. దీన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలని భావిస్తోంది. విద్యార్థులకు భోదిస్తున్న సబ్జెక్ట్ కు మరింత సమయం కేటాయించాలనే ఆలోచనలో భాగంగా ఈ ఆలోచన చేసినట్లు తెలిపింది. అయితే.. అన్ని పాఠశాలల్లో ఒకేసారి కాకుండా.. మొదటిగా కొన్ని బడులను ఎంపిక చేసుకుని ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో రెండు పాఠశాలల్ని ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో ఒకటి హైస్కూల్, మరొకటి హైస్కూల్ ప్లస్ ఉండనుండగా.. ఆయా పాఠశాలల్లో నవంబర్ 25 నుంచి 30 వరకు పెంచిన సమయాలు అమల్లోకి రానున్నాయి. అక్కడ వెలువడిన ఫలితాల్ని బట్టి రాష్ట్రంలోని మిగతా బడుల్లో ఈ సమయపాలన అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అయితే.. పెంచిన సమయాన్ని సబ్జెక్టులు భోదించేందుకు మాత్రమే వినియోగించనుండగా, మిగతా వెయిటేజీల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని అధికారులు వెల్లడించారు. విద్యాశాఖలోని అకడమిక్ కేలండర్ ఆఫ్షనల్ గా ఉన్న.. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పనిచేయాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సూచనల ప్రకారం.. పాఠశాల పనివేళల్లో మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
పాఠశాలల పని వేళల్లో అదనంగా గంట చేర్చడంతో.. పాఠశాలల్లో ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే విరామ సమయాలు, భోజన సమయాల్లోనూ మార్పులు చేపట్టారు. తరగతుల మధ్య విరామ సమయాన్ని 5 నిమిషాలు పెంచిన అధికారులు, భోజన విరామ సమయాన్ని 15 నిమిషాల మేర పెంచుతూ నిర్ణయించారు. ప్రస్తుతం అన్న పాఠశాలల్లో మొదటి తరగతి.. 45 నిముషాలుగా ఉంది. విద్యార్థుల అటెండెన్స్ ఇతర కొన్ని పనుల కోసం 5 నిముషాలు ఎక్కువగా ఇస్తుంటారు. ఇప్పుడు ఆ సమయాన్ని 50 నిముషాలుగా మార్చారు. ఆ తర్వాత 3 తరగతులు ప్రస్తుతానికి.. 40 నిమిషాల చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచుతూ.. అధికారులు నిర్ణయించారు. మధ్యాహ్నం నుంచి అన్ని తరగతులు 45 చొప్పున నడవనున్నాయి.
పాఠశాలల పని దినాలు తక్కువగా ఉంటుండడం, అనివార్య కారణాలతో కొన్ని అనుకోని సెలవులు వస్తుండడంతో.. రాష్ట్రంలోని విద్యాలయాల్లో విద్యార్థులకు సబ్జెక్టులు పూర్తిగా చెప్పలేకపోతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఈ కారణంగానే.. అందుబాటులోకి వచ్చిన అదనపు సమయాన్ని.. సబ్జెక్టుల పూర్తికి వినియోగించాలని నిర్ణయించింది. ఈ విధానంతో.. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడనుందని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ తరగతుల వారికి తర్వగా సబ్జెకులు పూర్తయితే.. రివిజన్ కి, సన్నద్ధ పరీక్షలకు ఉపయోగపడుతుందని అంటున్నారు.
Also Read : ఏపీకి మరో భారీ వర్షసూచన.. ఆ రోజుల్లో దంచుడే దంచుడు.. తస్మాత్ జాగ్రత్త సుమా!
అయితే ప్రభుత్వం నిర్ణయం విభిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సబ్జెక్టులకు సమయాన్ని పెంచాలనే నిర్ణయం సరైనదే అయినా.. విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ సూచిస్తున్నారు. ఉన్నత పాఠశాలలకు సమీపంలోని 5 కిలోమీటర్ల పరిధిలోని విద్యార్థులు వస్తుండడంతో.. సాయంత్రం ఆలస్యంగా బడులు ముగిస్తే, అలాంటి విద్యార్థులు ఇళ్లకు చేరుకునేందుకు అవస్థలు పడతారని అంటున్నారు. వాతావరణం సమస్యలతో పాటు ఇంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని.. పాఠశాలల పని వేళల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కోరుతున్నారు.