Heavy Rains in AP: ఏపీకి మరోమారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్ష సూచన ఉన్నట్లు ఆయన తెలిపారు.
దక్షిణ అండమాన్ సముద్రం లో నవంబర్ 21వ తేదీన ఆవర్తనం ఏర్పడుతుందని, దీనితో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో ఈనెల 27, 28వ తేదీలలో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని అన్ని జిల్లాల రైతులు, ప్రజలు గమనించాలని కోరారు.
వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఇప్పటి నుండే వ్యవసాయ పనులకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ సూచించారు. పలు జిల్లాలలో వరి సాగు చేసిన రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయ కార్యకలాపాలను ముందస్తుగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాలు కురిసిన యెడల, సాగు భూమిలోనే పంట నేలకు ఒరుగుతుందని, అటువంటి పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ముందస్తుగా వర్ష సూచన గురించి ప్రకటించింది.
అలాగే 27, 28 తేదీలలో వర్షం కురుస్తున్న వేళ విద్యుత్ మోటార్ల వద్దకు రైతులు వెళ్లకపోవడమే మంచిదని మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. అంతేకాకుండా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్త వహించాలన్నారు. ఇప్పటికే ఏపీకి భారీ వర్ష సూచనపై ఆయా జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించామని, అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తుగా అప్రమత్తమవుతుందన్నారు. రైతులారా తస్మాత్ జాగ్రత్త.. భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. మీ పంట రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోండి సుమా!