
Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. మే 5లోపు సీబీఐకు ఎర్ర గంగిరెడ్డి లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
నిర్దిష్ట గడువులోగా అభియోగపత్రం దాఖలు చేయకపోవడంతో ఎర్ర గంగిరెడ్డికు మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ చిల్లకూరు సుమలత విచారణ చేపట్టారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే దర్యాప్తు ముందుకు సాగదని సీబీఐ స్పష్టం చేసింది. ఆయన బయట ఉంటే విచారణకు సహకరించడానికి ప్రజలు ముందుకు రావడం లేదని తెలిపింది. గంగిరెడ్డి వెనుక రాజకీయ ప్రముఖులు ఉన్నారని.. అందుకే ప్రజల్లో భయం ఉందని వివరించింది.
సీబీఐ తరఫు న్యాయవాది నాగేందర్ వాదనలు వినిపించారు. బెయిల్ ను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏ కారణాల వల్ల ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. వివేకా హత్య పెద్ద కుట్ర అని, పథక రచన, అమలు ఎర్ర గంగిరెడ్డే చేశారని సీబీఐ తరఫు న్యాయవాది చెప్పారు.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ సమయంలో సిట్ కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారని సీబీఐ తరఫు న్యాయవాది అన్నారు. సిట్ సరిగా పనిచేయలేదని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. అందువల్లే వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. సిట్ కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని తేల్చిచెప్పారు. స్థానిక పోలీసులు ఏడాదిపాటు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లలేదన్నారు. ఈ కేసులో గూగుల్ టేకౌట్ లాంటి సాంకేతిక ఆధారాలున్నాయన్నాయని తెలిపారు. గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న తర్వాత ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.