Balineni Srinivasa Reddy: ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో బాలినేని సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ సీఎం జగన్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లక్ష్యంగా బాలినేని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. వైయస్ కుటుంబం అంటే మాజీ సీఎం జగన్ ఒక్కరే కాదని, వైయస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైయస్ సునీత, వీరందరూ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులన్న విషయాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తించాలన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన అనంతరం తాను మంత్రి, ఎమ్మేల్యే పదవులను త్యాగం చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని జగన్ సైతం గుర్తించాలన్నారు. తాను ఇటీవల సెకీ ఒప్పందంపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు, తాను నాడు సంతకం చేసి ఉంటే నేడు తన పరిస్థితి ఏమిటని బాలినేని ప్రశ్నించారు.
నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల వద్ద గుర్తింపు పొంది ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు బాలినేని ఇష్టారీతిన మాట్లాడుతున్నట్లు చేసిన వ్యాఖ్యలపై బాలినేని ఫైర్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దమ్ముంటే ప్రజా క్షేత్రంలోకి రావాలని, తాను కూడా ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాలినేని అన్నారు. ఎన్నికల సమయంలో ఒంగోలులో పోటీ చేసే నాయకుడు లేక, చిత్తూరు జిల్లా నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకువచ్చి ఎంపీగా పోటీ చేయడానికి తాను తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఈ సందర్భంగా బాలినేని అన్నారు.
విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, ఎమ్మెల్సీ పదవి కోసం కాకా పట్టే నీతిమాలిన పనులు చేసే వ్యక్తిని కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైట్ లో స్నేహితులతో కలిసి రష్యా వెళ్లడానికి కూడా స్వేచ్ఛ కావాలా అంటూ బాలినేని ప్రశ్నించారు. జనసేన పార్టీలో చేరిన సమయంలో తాను వైసీపీలో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపి, ఏ పదవి ఆశించకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరానన్నారు. తన పేరు ఉచ్చరించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. బాలినేని ఘాటుగానే సమాధానమిచ్చారు.
వైఎస్ విజయమ్మపై, వైఎస్ షర్మిళ పై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టించింది ఎవరో రాష్ట్రమంతా తెలుసన్నారు. సెకీ ఒప్పందంకు సంబంధించి తన వద్దకు ఫైల్ తీసుకొని సంతకం తీసుకొని వచ్చిందా నిజమా కాదా అంటూ బాలినేని ప్రశ్నించారు. తాను వైసీపీలో నుండి ఎందుకు బయటకు వచ్చానో.. బహిరంగ చర్చకు సిద్దమా అంటూ చెవిరెడ్డి కి బాలినేని సవాల్ విసిరారు.