CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇవాళ అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, నీటి వనరుల నిర్వహణ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చించనున్నారు.
ఆ తర్వాత పలువురు పారిశ్రామిక వేత్తలతోనూ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇక ఎల్లుండి నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరవుతారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి కుప్పానికి పయనమవుతారు సీఎం చంద్రబాబు.
ఇవాళ 10 గంటలకు పునరుత్పాదక ఇంధన శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యి.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకరించాలని కోరనున్నారు. ఆ తర్వాత 11 గంటలకు రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై BEL డిఫెన్స్ కాంప్లెక్స్, HAL-AMCA కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై డిస్కష్ చేస్తారు. 12గంటలకు జలశక్తి శాఖా మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అవుతారు.
ఇక మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో సమావేశం అవుతారు సీఎం చంద్రబాబు. నూతన పరిశోధనలు, ఆవిష్కరణ, పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై కేంద్రమంత్రితో చర్చిస్తారు. సాయంత్రం 3గంటలకు నార్త్‌బ్లాక్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించి.. మెరుగైన ఆర్థిక కేటాయింపులు చేయాలని.. రాష్ట్రాభివృద్ధికి మద్దతుగా నిలవాలని కోరనున్నారు చంద్రబాబు.
సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రి కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. రాత్రి 9గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలవనున్నారు. రేపు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు.
Also Read: వంశీ తర్వాత నెక్ట్స్ కొడాలి నాని.. విదేశాలకు వెళ్లకుండా నోటీసులు
ఇదిలా ఉంటే.. సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఏఐసీసీ కీలక నేతలతో భేటీ కానున్నారు సీఎం. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. ఈనెలాఖరు లేదా వచ్చేనెల మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నలుగురు లేదా ఐదుగురికి కేబినెట్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తారని టాక్. కేబినెట్‌లో చోటు దక్కనివారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ పదవులతో పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా కసరత్తు చేయనున్నారు సీఎం.