Princess Driver Stalking| ఓ రాజకుమారిని ఆమె వద్ద పనిచేసే కారు డ్రైవర్ ప్రేమించాడు. అయితే ఆమెకు ఇంతకుముందే వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. ఆమె మాత్రం అతడిని తన వద్ద పనిచేసే డ్రైవర్ గా మాత్రమే చూసింది. దీంతో ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఆ డ్రైవర్ పలురకాలుగా ప్రయత్నించాడు. అతని ప్రవర్తన చూసి భయపడిపోయిన ఆమె తన భర్తకు చెప్పింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బ్రిటన్ దేశంలో జరిగింది. అయితే లండన్ లో నివసిస్తున్న ఆమె మాత్రం ఖతర్ రాజకుటుంబానికి చెందిన యువతి.
ప్రేమ పేరిట ఖతర్ రాజకుటుంబానికి చెందిన ఓ రాజకుమారి వెంటపడి వేధించిన ఆమె కారు డ్రైవర్‌కు బ్రిటన్ కోర్టు తాజాగా ఏడాది జైలు శిక్ష విధించింది. కారాగార శిక్ష పూర్తయిన అనంతరం, మరో నెల రోజుల పాటు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కూడా నిందితుడిని ఆదేశించింది. నిందితుడు తాను చేసిన నేరం ఒప్పుకోవడంతో ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది. నిందితుడి మానసిక ఆరోగ్యం సరిగా లేని విషయాన్ని అంగీకరిస్తూ అతడి తీరు వల్ల రాజకుమారి తీవ్ర మనోవేదనకు గురైయ్యారని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
Also Read: ఆస్పత్రిలో భర్త ఆపరేషన్.. డబ్బులు, నగలతో పరారైన భార్య.. హత్య కేసు
కోర్టు వివరాల ప్రకారం, నిందితుడు అబూ సల్హా (47) కొంతకాలం పాటు ఖతర్ రాజకుమారి హయా అల్ థానీ వద్ద కారు డ్రైవర్‌గా ఉద్యోగం చేశాడు. ఈ క్రమంలో మార్చి 1 నుంచి 23వ తేదీ మధ్య ప్రేమ పేరిట రాజకుమారిని వేధింపులకు గురి చేశాడు. ఆమెకు పలుమార్లు పుష్ప గుచ్ఛాలు పంపించాడు. బహుమతులు ఇచ్చేందుకు కూడా ప్రయత్నించాడు.
తొలుత అతడి ప్రవర్తనపై రాజకుమారికి ఎటువంటి సందేహం రాలేదు. అయితే, తరచూ తన ఇంటి సమీపంలో నిందితుడు తచ్చాడుతూ కనిపించడం తో రాజకుమారికి ఆందోళనకు గురైంది. రాజకుమారి సిబ్బంది ద్వారా ఆమెకు రకరకాల వస్తువుల బహుమతిగా ఇచ్చే ప్రయత్నం చేయడంతో కంగారు పడింది. తన షెడ్యూల్ గురించి పూర్తిగా తెలిసిన అతడు ఎక్కడ హాని తలపెడతాడోనని ఆందోళన చెందింది. తన పిల్లల భద్రతపై కూడా ఆందోళన చెందిన ఆమె చివరకు భర్తకు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణగా బాడీ గార్డు ఏర్పాటు చేయమని కోరింది. ఈ క్రమంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేశాక అతనిపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేశారు.
కోర్టు తొలి దశ విచారణలోనే నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు. అయితే, తన క్లయింటు మానసిక స్థితి సరిగా లేదని అతడి తరపు న్యాయవాది వాదించారు. తను రాజకుమారి వెంటపడటమే కాకుండా ఆమె కూడా తనపై మనసు పారేసుకుందని భ్రమించినట్టు తెలిపాడు. త్వరలో రాజకుమారిని పెళ్లాడబోతున్నట్టు భావించి భార్యకు విడాకులిచ్చినట్టు కూడా లాయర్ తెలిపారు.
కాగా, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడి న్యాయవాది వాదనలతో పాక్షికంగా ఏకీభవించారు. అయితే, అతడి చర్యల కారణంగా బాధితురాలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొందని చెప్పారు. దీంతో, నిందితుడికి సంవత్సరం పాటు కారాగార శిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించారు. వచ్చే మూడేళ్ల పాటు రాజకుమారిని కానీ, ఆమె కుటుంబాన్ని గాని కలిసేందుకు మాట్లాడేందుకు ప్రయత్నించవద్దని నిందితుడిని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.