
TANA conference 2023 news today(Telugu news updates): ఉత్తర అమెరికా తెలుగు సంఘం ..తానా. అమెరికాలోని ప్రవాసాంధ్రులందరికీ అండగా నిలిచిన సంస్థ. ఇప్పుడు ఆధిపత్య పోరుతో వీధిన పడింది. తాజాగా ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌లో జరుగుతున్న తానా సభల్లో ప్రవాసాంధ్రులు తన్నుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాలు చెందినవారు కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ కోమటి జయరాం సమక్షంలోనే ఈ ఘర్షణ జరిగింది.
కొన్ని అంశాలపై తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. దీంతో తెలుగు తమ్ముళ్లు తన్నులాటకు దిగారు. ఒకరిపై ఒకరు కర్రలు కూడా విసురుకున్నారు.
అమెరికాలో తానాకు ఎంతో చరిత్ర ఉంది. తాజాగా జరిగిన ఘటన ఆ సంస్థపై మచ్చగా మిగిలిపోనుంది. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ లో 23వ తానా మహాసభలను శనివారం ఘనంగా ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలి రోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన తర్వాత కొందరు తానా ముఖ్యు సభ్యులు కన్వెన్షన్ సమీపంలోని హాలులో కలుసుకున్నారు.
తానా సభలో ఘర్షణపై సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాలో పరువు తీశారని మండిపడ్డారు. ఎంతోమంది జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా అని ఘాటుగా ట్వీట్ చేశారు.