
Amarnath yatra : ప్రతికూల వాతావరణం కారణంగా 3 రోజులపాటు నిలిచిపోయిన అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. జమ్మూ-కశ్మీర్‌లోని పంజ్‌తర్ణి, శేష్‌నాగ్ క్యాంపుల నుంచి యాత్రికులు మళ్లీ బయల్దేరారు. వర్షాల వల్ల పంజ్‌తర్ణిలో 1500 మంది సందర్శకులు చిక్కుకుపోయారు. వారిలో 200 మంది తెలుగువారు ఉన్నారు. ఆదివారం అమర్‌నాథ్ ఆలయం వద్ద వాతావరణం సానుకూలంగా మారింది. దీంతో అధికారులు వెంటనే గేట్లను తెరిచారు. హిమలింగానికి భక్తులు పూజలు చేసేందుకు అనుమతించారు.
ఇప్పటికే దర్శనం చేసుకొన్న భక్తులను బల్తాల్ బేస్ క్యాంపునకు చేరుకొనేందుకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అనంతనాగ్‌లో సైన్యం క్వాజిగుండ బేస్‌క్యాంప్‌లో 700 మంది సందర్శకులకు ఆశ్రయం కల్పించింది.
మరోవైపు భారీ వర్షాల వల్ల జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేను మూసివేశారు. ఈ పరిస్థితుల్లో జమ్మూ నుంచి యాత్రికులను అనుమతించడంలేదు. ఈ జాతీయ రహదారిపై అనేక చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. రామ్‌బన్ జిల్లాలో 40 అడుగుల వరకు రహదారి దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో 3,500 వాహనాలు చిక్కుకుపోయాయి.
గురువారం రాత్రి నుంచి జమ్మూ-కశ్మీర్‌లో భారీ వానలు పడుతున్నాయి. అమర్‌నాథ్ క్షేత్రం వద్ద భారీగా మంచు కురుస్తోంది. దాదాపు 50 వేల మంది యాత్రికులు బేస్ క్యాంపుల్లోనే ఉండిపోయారు. సోమవారం నుంచి వాతావరణం మరింత సానుకూలంగా మారుతుందని వాతావరణశాఖ ప్రకటించింది.