GV Reddy: ఏపీ బడ్జెట్‌పై ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. కేవలం 33 వేల కోట్ల రూపాయల అతి తక్కువ రెవెన్యూ లోటుతో.. ఏపీ ప్రభుత్వం అద్భుతమైన భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని ప్రశంసల వర్షం కురపించారాయన. అంతేకాదు.. సీఎం చంద్రబాబుపై ఆయనకు ఉన్న అభిమానాన్ని కూడా జీవీ రెడ్డి వ్యక్తపరిచారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబుపై తన గౌరవం, అభిమానం అలాగే ఉంటుందని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు జీవీరెడ్డి. తక్కువ కాలంలోనే పార్టీలో, ప్రభుత్వంలో తనకు గౌరవప్రదమైన బాధ్యతలు కల్పించారని గుర్తు చేశారాయన. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా సీఎం కావాలని కోరుకున్నారు జీవీరెడ్డి.
ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రీసెంట్‌గా ఆయన రాజీనామా చేశారు. అంతేకాదు.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారాయన. ఫైబర్ నెట్ లో ఎవరూ తనకు సహకరించడం లేదని ఆరోపించారాయన. ఈ వివాదం నాలుగు రోజుల పాటు నడిచిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే.. శుక్రవారం నాడు 2025- 26 బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రూ. 3. 22 లక్షల కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్ ను ప్రతిపాదించింది. పలు కీలక రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యతనివ్వగా.. సూపర్ సిక్స్ లో రెండింటికి నిథులు కేటాయించింది. గత ప్రభుత్వ లోపాలు, వ్యవస్థల నిర్వహణ వైఫల్యాల గురించి తన ప్రసంగంలో వివరించారు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్. అంతే కాదు తమ ప్రభుత్వ లక్ష్యాలను సైతం ప్రకటించారు.
1995 లో చంద్రబాబు సీఎం అయిన టైంలో.. ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి గుర్తు చేశారు. ఏపీలో.. గత ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు సరిగా చెల్లించలేదని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటీ సరి చేసుకుంటూ.. వ్యవస్థను గాడిలో పెడుతున్నట్టు చెప్పారు. ఈ సమస్యలతో బడ్జెట్ ప్రవేశ పెట్టడం కూడా కష్టమేనని అన్నారు ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల.
తొలిసారి మూడు లక్షల కోట్లకు పైగా అంచనాలతో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ముఖ్యాంశాలేంటని చూస్తే.. అమరావతి నిర్మాణం కోసం కోసం 6000 కోట్లు కేటాయించగా.. రహదారుల నిర్మాణానికి 4220 కోట్లు. మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం, రామాయపట్నం.. అలాగే భోగాపురం పోర్టులకు, ఎయిర్ పోర్టులకు కలిపి 605 కోట్లు వెచ్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కోసం రూ. 10 కోట్లు.. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఎం కాల్ సెంటర్ కోసం 101 కోట్లు, ఎన్టీఆర్ భరోసా కోసం 27 వేల 518 కోట్లు.. ఆదరణ పథకం కోసం వెయ్యి కోట్లు కేటాయించారు.
Also Read: సజ్జల చెప్పారు.. అందుకే ఆ కామెంట్స్ చేశా.. పోసాని
డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కింద రూ. 3, 486 కోట్లు, తల్లికి వందనం పథకం కోసం రూ. 9407 కోట్లు, దీపం 2. 0 కోసం రూ. 2,601 కోట్లు, బాల సంజీవని, బాలసంజీవనీ ప్లస్ కోసం రూ. 1163 కోట్లు, మత్స్యకార భరోసా కోసం రూ. 450 కోట్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల స్కాలర్షిప్లు కోసం 337 కోట్లు, స్వచ్ఛ ఆంధ్ర కోసం మరో 820 కోట్లు, ఎస్సీ- ఎస్టీ ఉచిత విద్యుత్ 400 కోట్లు, బడ్జెట్ కేటాయింపులు చేశారు.
అన్నదాత- సుఖీభవ కోసం 6300 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు.. 62 కోట్లు, ధరల స్థికరణ నిధి కోసం 300 కోట్లు, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి- గోదావరి డెల్టా- కృష్ణ డెల్టా- ప్రాజెక్టులకు.. 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు.. 6705 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం.. 2800 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం.. 500 కోట్లు కేటాయించారు.
నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల బారి బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా రూపొందించారు.
నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల…
— G V Reddy (@gvreddy0406) March 1, 2025