Vijayawada politics: బెజవాడలో అన్నదమ్ముల మధ్య విభేదాలకు రాజకీయ రంగు పులుముకుందా? ఇంతకీ మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణల్లో నిజముందా? నాని మాటలు బూమరాంగ్ అయ్యాయా? తమ్ముడు చిన్నిని బద్నామ్ చేయడానికి వేసిన స్కెచ్‌లో భాగమేనా? లేకుంటే లిక్కర్ కేసును డైవర్ట్ చేసేందుకు ఈ స్కెచ్ వేశారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
బెజవాడలో కేశినేని నాని-తమ్ముడు చిన్ని మధ్య రాజకీయ చదరంగం మొదలైంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే క్రమంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారు. లిక్కర్ స్కామ్‌లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయం ఉందంటూ మరోసారి ఆరోపణలు గుప్పించారు మాజీ ఎంపీ కేశినేని నాని.
మళ్లీ అదే ఆరోపణలు, ఆధారాలేవి?
ఫేస్‌బుక్ వేదికగా మరోసారి ఆరోపణలు చేశారు ఆయన. ‘దొరా నువ్వు ఎన్ని పిట్ట కథలు చెప్పినా బుకాయించినా నువ్వు రాజ్ కెసిరెడ్డి కలసి 2019 డిసెంబర్ నుండి మద్యం కుంభకోణం సొమ్ములు నీకు, నీవారికి సంబందించిన దాదాపు 56 డొల్ల కంపెనీల ద్వారా దేశ విదేశాలకు దారి మళ్లించిన విషయం యదార్థం’ అని రాసుకొచ్చారు.
ఇంతవరకు బాగానే ఉంది. రాజకీయ నాయకుల మాదిరిగా కేవలం ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ. తమ్ముడిపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు బయట పెట్టలేదు. సిట్ విచారణలో ఎంపీకి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కసిరెడ్డి బయటపెట్టిన సందర్భం కనిపించలేదు. చిన్నిని టార్గెట్ చేసి టీడీపీని అభాసుపాలు చేయడానికి నాని వేసిన ఎత్తుగడగా కనిపిస్తోంది.
ALSO READ: అమరావతా? మూడు రాజధానులా? క్లారిటీ మిస్సయిన వైసీపీ
అసలు మనీలాండరింగ్ జరిగితే ఐటీ, ఈడీ అధికారులు సైలెంట్‌గా ఊరుకుంటారా? అన్నది మరో ప్రశ్న. పన్నులు ఎగ్గొట్టినవారి ఇళ్లపై దాడులు చేస్తున్నారని అంటున్నారు. అలాగే జరిగితే ఎప్పుడో విజయవాడ ఎంపీ ఇంటపై ఈడీ దాడులు జరిగేవని అంటున్నారు. నాని వ్యవహారశైలి పరిశీలించినవాళ్లు మాత్రం తమ్ముడిని చూపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసినట్టు ఉందని అంటున్నారు. ఒకే మాట నాని పదేపదే చెబుతున్నారు.
నాని మాటల వెనుక వైసీపీ?
కేశినాని నాని ఆరోపణల వెనుక వైసీపీ ప్రమేయం ఉందని అంటున్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు లోతుగా వెళ్తున్న కొద్దీ దాని మూలాలు తాడేపల్లి ప్యాలెస్‌కు లింకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ స్కెచ్ వేసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎంపీని టార్గెట్ చేస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం వెనుక అసలు కారణమని ఇదేనని అంటున్నారు.
మొత్తానికి తమ్ముడితో విభేదాలు టీడీపీ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని కొందరు నేతల మాట. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న మాజీ ఎంపీ, ఈ మధ్యకాలంలో తన వాయిస్ రైజ్ చేయడం వెనుక అసలు కారణం ఇదేనని అంటున్నారు.