మూడు రాజధానులపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
గతంలో బొత్స కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇంతకీ జగన్ మూడు రాజధానులపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఇంకా ఆ పార్టీకి ఎంత నష్టం జరిగాక మేల్కొంటారు. అసలు ఏపీ ప్రజల అభిప్రాయం వైసీపీ పరిగణలోకి తీసుకుంటుందా, లేదా..?
నాడు బొత్స.. నేడు గుడివాడ !
మూడు రాజధానులపై మళ్లీ పాత పాటే ! pic.twitter.com/Uol745frgh
— Telugu360 (@Telugu360) May 5, 2025
2019 ఎన్నికల నాటికి వైసీపీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉంది, మూడు రాజధానులు అనే ప్రతిపాదనేదీ అప్పటికి లేదు. సో ఆ ఎన్నికల్లో ఏకైక రాజధాని ప్రధాన అజెండానే కాదా అనేది చెప్పలేం. ఇక 2024 నాటికి కూటమి అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పింది. వైసీపీ మూడు రాజధానులే తమ అజెండాగా ప్రొజెక్ట్ చేసింది. జనం కూటమికే ఓటు వేశారు. అంటే మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ ని వారు పూర్తిగా తిరస్కరించారనే చెప్పాలి. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడం దీనికి నిదర్శనం. ఇక కూటమి అధికారంలోకి రావడంతో, తిరిగి అమరావతి పనులు జోరందుకున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం మొదలు పెట్టారు. మరి ఈ దశలో వైసీపీ స్టాండ్ ఏంటి..? ఇంకా మూడు రాజధానులు అంటారా, లేక అమరావతి ఏకైక రాజధాని అని తేల్చి చెబుతారా..?
ఆమధ్య వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఏపీ రాజధాని అమరావతి విషయంలో తమ పార్టీ స్టాండ్ ని సరిగ్గా చెప్పలేకపోయారు. ఇప్పటికీ మూడు రాజధానులే తమ అజెండా అని అనలేదు, అదే సమయంలో అమరావతి ఏకైక రాజధాని అని కూడా ఆయన ఒప్పుకోలేదు. పార్టీలో చర్చించి తమ నిర్ణయం చెబుతామన్నారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా అదే పాట పాడారు. మూడు రాజధానుల విషయంలో తమ నిర్ణయాన్ని పార్టీలో చర్చించి చెబుతామన్నారు. ఇంతకీ ఆ చర్చ ఎప్పుడు జరుగుతుంది, ఏమని చెబుతారు..?
అంత ఇగో అవసరమా..?
చంద్రబాబు అమరావతి రాజధాని అన్నారు, జగన్ మూడు రాజధానులు చేస్తానన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన మూడు రాజధానుల పంతాన్ని నెగ్గించుకోడానికి జగన్ చాలా దూరం వెళ్లారు. అప్పట్లో శాసన మండలిలో టీడీపీ బలం ఎక్కువగా ఉండటంతో మూడు రాజధానుల బిల్లు మండలిలో పాస్ కాలేదు. ఆ కోపంతో ఏకంగా శాసన మండలినే రద్దు చేస్తానన్నారు జగన్, ఆ తర్వాత వెనక్కు తగ్గారు. ఆ తర్వాత అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవాలని చూశారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. అమరావతిలో గందరగోళం సృష్టించేందుకు ఇతర ప్రాంతాల ప్రజలకు అక్కడ ఫ్లాట్లు ఇవ్వబోయారు. అమరావతిపై కక్షగట్టినట్టే ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఆయన తన మనసు మార్చుకుంటారో లేదో చూడాలి. ప్రజలు తమకు మూడు రాజధానులు అవసరం లేదు, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే చాలనుకుంటున్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటే మేలని అభిప్రాయ పడుతున్నారు. ఆ ప్రజాభిప్రాయాన్ని ఆమోదించడానికి జగన్ కి అంత ఇగో ఎందుకనే ప్రశ్నలు వినపడుతున్నాయి. దీనికి ఎంత త్వరగా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.