Kovur Politics: వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యాయా? ఏదో విధంగా వార్తల్లో నిలిచేందుకు ఉండేందుకు నేతలు తహతహలాడుతున్నారా? ప్రజలు మరిచిపోతారని భావించిన నేతలు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారా? వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి విషయంలో అదే జరిగిందా? రేపో మాపో ఆయన్ని అరెస్టు చేయడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డ ప్రసన్నకుమార్‌రెడ్డి అరెస్టు రంగం సిద్ధమైంది. త్వరలో ఆయన్ని పోలీసులు అరెస్టు చేయనున్నట్లు సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డ ప్రశాంత్ రెడ్డిపై ఆయన చేసిన అభ్యంతర వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. చివరకు సీఎం చంద్రబాబు సైతం ప్రసన్న వ్యాఖ్యలను తప్పబట్టారు.
మహిళలపై వ్యక్తిగతంగా విమర్శలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వీరు మనుషులేనా? మహిళా నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైసీపీ చేస్తున్న కుట్రలను గమనించాలన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు.
ఇదిలావుండగా ప్రసన్నకుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాల నేతలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చైర్ పర్సన్ రాయపాటి శైలజ వెల్లడించారు. ప్రసన్న వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ నేతలు సైతం ఖండించారు.
ALSO READ: అన్నదాత సుఖీభవ స్కీమ్ గడువు వచ్చేసింది, ఇలా చేయండి?
ప్రశాంత్‌రెడ్డిపై అసభ్యకరమైన కామెంట్స్ నేపథ్యంలో ప్రసన్నకుమార్‌రెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే ఆ జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిన ప్రసన్నకుమార్ రెడ్డి.. ఆనాటి నుంచి గెలుస్తూనే వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ప్రశాంత్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.
ఓటమిని జీర్ణించుకోలేని ఆయన, ఆనాటి నుంచి పగతో రగిలిపోతూనే ఉన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు సదరు ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం కార్యకర్తల సమావేశంలో నోరు జారి అడ్డంగా బక్కయ్యారు ప్రసన్నకుమార్.
ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కారు, ఇంట్లోని ఫర్మీచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చెల్లెలు వరస అయ్యే తనను నీచంగా మాట్లాడారని అన్నారు.
ప్రసన్నకుమార్ వ్యాఖ్యలపై ఆ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. కార్యకర్తలను ఆపగలను కానీ అభిమానులను ఆపలేమన్నారు. ఎవరో వెళ్లి దాడి చేసి ఉండవచ్చని, వాళ్లు కొంచెం చేస్తే.. మిగతాది ప్రసన్న చేసివుంటారని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు సదరు ఎమ్మెల్యే. తాను గెలిచిన తర్వాత అదే కంటిన్యూ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని కార్యకర్తలు టీడీపీలోకి వస్తున్నారని, అది తట్టుకోలేక ప్రస్టేషన్‌లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నుంచి మరో నేత అరెస్టు కావడం ఖాయమన్నమాట.