ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకి వైసీపీ అధినేత జగన్ కి చెందిన సాక్షి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోంది. ఈ సినిమా టికెట్ రేట్లు అన్యాయంగా పెంచారంటూ రచ్చ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలు రిలీజైనప్పుడల్లా టికెట్ రేట్లు పెంచడం పరిపాటి. కానీ ఇదేదో పవన్ సినిమాకే జరుగుతున్నట్టుగా వైసీపీ కథనాలివ్వడం విశేషం. అయితే ఈ ప్రచారంతో పవన్ సినిమాకి మరింత ప్రచారం లభించినట్టవుతోందని అంటున్నారు ఆయన అభిమానులు.
టికెట్ రేట్లు ఇలా..
హరిహర వీరమల్లు ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈనెల 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో లకు ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.600లుగా నిర్ణయించారు. ఇది పూర్తిగా ఫ్యాన్స్ వ్యవహారం కాబట్టి ఇక్కడ టికెట్ రేట్లపై కంప్లయింట్స్ లేవు. ఇక రిలీజ్ రోజు నుంచి తొలి 10 రోజుల వరకు టికెట్ రేట్లు పెంచి అమ్ముకునేలా ప్రభుత్వం అనుమతులిచ్చింది. సింగిల్ స్క్రీన్ లోయర్ క్లాస్ లో రూ.100, అప్పర్ క్లాస్‌లో రూ.150, మల్టీ ప్లెక్స్ లో రూ.200 వరకు టికెట్ ఛార్జీలను పెంచుకునే అవకాశం కల్పించారు. అన్ని సినిమాలకు టికెట్ రేట్లు ఇలానే పెంచుతారు. ఇందులో హరిహర వీరమల్లుకి మాత్రమే ప్రత్యేకంగా ఎలాంటి వెసులుబాటు లేదు. మరిక్కడ జగన్ టీమ్ ఆవేదన ఏంటో వారికే తెలియాలి అంటున్నారు నెటిజన్లు.
గతంలో జగన్ ఏం చేశారు..?
గతంలో సినిమా టికెట్ రేట్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసింది. టికెట్ రేట్లు భారీగా తగ్గించింది. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో ఈ నిబంధనను కచ్చితంగా పాటించారు అధికారులు. దీంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడింది. ఆ తర్వాత మళ్లీ ప్రభుత్వం పాత విధానంలోకే వచ్చింది. సినిమా రిలీజైన తర్వాత స్పెషల్ రేట్స్ కి అనుమతులిచ్చింది. వైసీపీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అప్పుడు బయటపడ్డాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ సినిమాకయినా ఒకటే రూల్ అమలవుతోంది. నిర్మాతలు వచ్చి బడ్జెట్ చూపించి టికెట్ రేట్లు పెంచుకుంటామని అడిగితే ప్రభుత్వం ఉదారంగా అనుమతులిచ్చేస్తోంది. హరిహర వీరమల్లు విషయంలో కూడా ఇదే జరిగిందని అంటున్నారు జనసేన నేతలు.
మీకో న్యాయం, మాకో న్యాయమా..?
పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ నేతలు ఇప్పటికే చాలాసార్లు సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారు. ఆయన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని సవాళ్లు విసిరిన నేతలు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. కాస్త వీలు చూసుకుని పవన్ గతంలో ఒప్పుకున్న సినిమాల షూటింగ్ లకు హాజరైనా కూడా వైసీపీ నేతలు హడావిడి చేస్తున్నారు. వైసీపీలో మంత్రులుగా చేసినవారు కూడా సినిమాలు, టీవీషోలు, ప్రోగ్రామ్స్ లో కనిపించారు. అప్పుడు లేని నియమాలు ఇప్పుడెందుకని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. అందులోనూ పవన్ తాను గతంలో కమిట్ అయిన సినిమాలు మాత్రమే పూర్తి చేస్తున్నారు. కొత్తగా ఏ సినిమాకి కూడా ఆయన సైన్ చేయలేదు. అయినా కూడా పవన్ పై నిందలు వేయడం సరికాదని అంటున్నారు జనసేన నేతలు.