Weather News: మూడు, నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అంతకు ముందు రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. ఈ ఏడాది మే చివరి వారంలో వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. మళ్లీ జులై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. జూన్ నెలలో మాత్రం వర్షాలు పడక రైతులు ఆందోళన చెందారు. జులైలో కూడా మొదటివారంలో తప్ప వర్షాలు పడింది లేదు. రెండు, మూడు రోజుల నుంచి హైదారాబాద్, పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు కాస్త ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు కొంత నిరాశ చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న, మొన్న హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం పడగా.. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో అయితే వర్షం పడక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
నాలుగు రోజులు భారీ వర్షాలు..
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది. అయితే ఈరోజు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక హైదరాబాద్ లో కూడా భారీ నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది..
భాగ్యనగర వాసులు జాగ్రత్త
భాగ్యనగరంలో భారీ వర్ష పడే ఛాన్స్ ఉండడంతో జీహెచ్ఎంసీ, రెస్క్యూ టీంలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్ లో పలు చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. సాయంత్రం, రాత్రి సమయంలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. దక్షిణ కోస్తా ఆంధ్ర నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. ఇవాళ, రేపు భారీ వర్షాలు పడుతాయని పేర్కొన్నారు. రాబోయే మూడు, నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని వివరించారు.
ALSO READ: BANK JOBS: 5208 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా..? రేపే లాస్ట్ డేట్ మిత్రమా..
ALSO READ: Scholarship: చదువుకునే స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఈజీగా రూ.75,000 స్కాలర్‌షిప్ పొందండిలా..