AP Politics : ఒక్క కేసు. రెండు జీవోలు. ఏపీ పాలిటిక్స్‌ను మరోసారి షేక్ చేస్తున్నాయి. తుని రైలు దగ్థం కేసుపై మరోసారి రచ్చ జరుగుతోంది. కాపుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. పాత గాయాన్ని తిరగతోడేలా సడెన్‌గా ఓ జీవో రిలీజ్ అయింది. ఉలిక్కిపడిన సర్కార్ వెంటనే ఆ జీవోను రద్దు చేసింది. అంతే. తుని కేసు చుట్టూ కాపు చిచ్చు రగిలింది.
అసలేం జరిగిందంటే..
2016లో కాపు ఉద్యమనిరసనల్లో భాగంగా తునిలో రైలుకు నిప్పుపెట్టిన కేసు రీ ఓపెన్‌పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు ఈ కేసును రీ ఓపెన్ చేసే ఉద్దేశంలేదని, తిరిగి విచారణ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసే ఆలోచన కూడా లేదని సర్కార్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అప్పీల్‌కు వెళ్లాలని మొదట ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ మరో జీవో ఇచ్చింది.
తుని కేసుల అప్‌డేట్స్
తుని ఘటన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం సహా.. అనేక మందిపై కేసులు నమోదు చేసింది. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లడంతో.. రైల్వే అధికారులు కూడా కఠినమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ కేసులను ఎత్తివేసింది. 2021లో విజయవాడలోని 7వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జ్, కోర్ట్ ఫర్ రైల్వేస్ కూడా ఈ కేసులను కొట్టివేసింది.
జీవోల్లో ఏముందంటే..
ఇలా అన్ని కేసులు కొట్టివేసిన తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వం నుంచి ఈ కేసులను తిరిగి పునర్‌విచారించాలంటూ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలంటూ జీవో జారీ అయ్యింది. ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ముఖ్యులైన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కామన ప్రభాకర్‌రావులాంటి వారికి మళ్లీ చిక్కులు తప్పవని తేలిపోయింది. కానీ ప్రభుత్వం వెంటనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లే ఆలోచన లేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
జీవోల జంజాటం..
అసలు జీవో ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఎవరి పర్మిషన్‌తో జీవో బయటికి వచ్చింది? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే తుని కేసును తట్టి లేపడమంటే.. ఏపీలో మరో తేనే తుట్టెను కదిపినట్టే. మొత్తం కాపులను కదిలించినట్టే. అంతటి సున్నితమైన అంశం గురించి ఆదేశాలు వెలువడే ముందు కనీసం ఎందుకు క్రాస్ చేసుకోలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్. అసలు ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే ఈ జీవో వెలువడిందనేది మాత్రం తెలుస్తోంది. అందుకే జీవో విడుదలై వారి దృష్టికి రాగానే వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు. క్లారిటీ ఇస్తూ.. జీవోను వెనక్కి తీసుకున్నారు.
తప్పిదమా? కుట్ర దాగుందా?
ఏ స్థాయి అధికారి ఆమోదంతో ఈ ఫైల్ మూవ్ అయ్యింది.. ఎందుకు జీవోగా మారింది అనే దానిపై ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అసలు CMO పెద్దల జోక్యం లేకుండా.. సీఎస్ పరిశీలించకుండా.. సీఎం చంద్రబాబు ఓకే అనకుండా ఇలాంటి అత్యంత ముఖ్యమైన జీవో ఎలా బయటికి వచ్చిందనేది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. అది కూడా కూటమి ప్రభుత్వం తన ఏడాది పాలనను పూర్తి చేసుకుంటున్న సమయంలో ఈ జీవో రావడం మరిన్ని అనుమానాలకు తెరలేపుతోంది. దీని వెనక మరేదైనా కుట్ర ఉందా? లేక అధికారుల తప్పిదమేనా? అనే దానిపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.
వైసీపీ కాపు కోణం..
మరోవైపు, తుని ఎపిసోడ్‌పై ప్రభుత్వం డ్రామాలు చేస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అప్పీలుకు వెళ్లాలన్న జీవో ఇచ్చి.. ఇప్పుడు తూచ్ అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు, హోంమంత్రికి తెలియకుండానే జీవో ఇచ్చారా..? అని ప్రశ్నించారాయన. నిజంగా వారికి తెలియకుండా జీవో వచ్చుంటే.. వాళ్లంత అసమర్ధులు మరొకరు ఉండరని అన్నారు అంబటి. డేగ కన్ను అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ జీవో గురించి తెలియకుండా పోయిందా అని నిలదీశారు. వైసీపీ హయాంలో కాపులపై తీసేసిన కేసులను మళ్లీ పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. దీనిపై కాపు ప్రజానీకంతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు అంబటి రాంబాబు.