Govt closely monitoring flood situation in AP: ఎట్టకేలకు ఏపీ వరదలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఏపీలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తక్షణ సాయం కోసం సిఫారసులు చేసేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిన అమిత్ షా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
కేంద్ర విపుత్త నిర్వహణ శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో నిపుణుల బృందం నేడు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బృందం ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ భద్రత తదితర అంశాలపై సిఫార్సులు చేస్తదంటూ ఆయన స్పష్టం చేశారు.
Also Read: ఏపీలో కూడా హైడ్రాను ఏర్పాటు చేసి.. బుడమేరు ఆక్రమణలు తొలగించాలి: షర్మిల
కాగా, భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడతోపాటు ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వం కోల్పోయిన దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ విపత్తు నుంచి కోలుకొని సాధారణ పరిస్థితులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రజలకు పెద్ద ఎత్తున ఆహారం, నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. వరద బాధితుల సంఖ్య 6.44 లక్షలకు చేరగా, వీరిలో 42,707 మందిని 193 సహాయక శిబిరాలకు తరలించారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 63 వేల కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు అధికారులు గుర్తించారు. అదేవిధంగా భారీ వర్షాలతో తెలంగాణ, ఏపీలో భారీగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో వెంటనే ఏరియల్ సర్వే నిర్వహించాలని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
Also Read: తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం భారీ విరాళం.. ఏపీ పంచాయతీలకు మరో రూ. 4 కోట్లు ?