Weather News: గత కొన్ని రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా ఏపీలో గోదావరి జిల్లా, ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురిశాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అల్పపీడనం గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. స్థానిక అధికారులు ఇప్పటికే విపత్తు నిర్వహణ బృందాలను రెడీ చేస్తున్నారు. అలాగే ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఈ భారీ వర్షాల కారణంగా వ్యవసాయం, రవాణా, రోజువారీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రహదారులపై ప్రయాణించే వారు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు. అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని చెప్పారు.
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షం..
తెలంగాణలోనూ రాబోయే నాలుగు రోజులు పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని.. ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని వివరించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వివరించింది.
ALSO READ: Karimnagar News: పరమ అధ్వాన్నంగా రహదారులు.. రోడ్డుపై గుంతల వద్ద కూర్చొని యువకుడు నిరసన
ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షం..
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.