Five Days Heavy Rains to Telugu States: హైదరాబాద్ లో వాతావరణం ఉన్నట్లుండి చల్లబడింది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఏపీలో గురువారం ఉదయం నుంచి మొదలైన చిరుజల్లులు సాయంత్రానికి భారీ వర్షంగా మారింది. ఇటు తెలంగాణలోనూ గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. హఠాత్తుగా వచ్చిన భారీ వర్షానికి పంటంతా అర్పితమైంది. కొన్ని జిల్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యం తడిచి మొలకెత్తడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు పిడుగుపాటుకు సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు రైతులు మరణించగా.. రంగారెడ్డి జిల్లాలో ఒక యువకుడు మృతి చెందాడు. మృతులు కంబళ్ల శ్రీనివాస్ (32), రుద్రారపు చంద్రయ్య (45), పసునూరి ప్రవీణ్ (30)లుగా గుర్తించారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లా కనగల్ లో అత్యధికంగా.. గురువారం ఒక్కరోజే 10.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్ లో 9 సెంటీమీటర్లు, షేక్ పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 14 మండలాల్లో 6.7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో వర్షం కురిసినప్పుడల్లా రోడ్లపై నీరు ఏరులై పారుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి కూడా వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పలేదు.
యూసఫ్ గూడ, బంజారాహిల్స్, మలక్ పేట మెట్రోస్టేషన్ల సమీపంలో పార్క్ చేసిన టూ వీలర్లు.. వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. పాతబస్తీ – మాదాపూర్, మేడ్చల్ – ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ – పటాన్ చెరు వరకూ ఉన్న నాలాలు వర్షపు నీటితో నిండి పొంగి ప్రవహించాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈనెల 20వ తేదీ వరకూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పిల్లల్ని రోడ్లపైకి పంపవద్దని హెచ్చరించింది.
Also Read: హైదరాబాద్‌లో భారీ వర్షం.. సీఎం రేవంత్ సమీక్ష..
ఏపీలోనూ మరో ఐదురోజులపాటు కుండపోత వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
కాగా.. కేరళకు కూడా భారీ వర్షసూచన ఉందని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది. మే 18న పాలక్కాడ్, మలప్పురం, మే 19న పతనంతిట్ట, అలప్పుజా, ఇడుక్కి, మే 20న తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పతనంతిట్ట, ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్‌లలో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మే 18న తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుళా, ఇడుక్కి, కోజికోడ్ మరియు వాయనాడ్ జిల్లాలకు, మే 19న తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకుళం, పాలక్కాడ్, మలప్పురం జిల్లాలకు వర్షసూచన ఉన్నట్లు చెప్పింది ఐఎండీ.
Also Read: Lightning Strikes : పశ్చిమ బెంగాల్ లో పిడుగుల వర్షం.. 11 మంది మృతి
రెడ్ అలర్ట్ 24 గంటల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ భారీ నుండి అతి భారీ వర్షాన్ని సూచిస్తుంది. ఆరెంజ్ అలర్ట్.. 6 సెం.మీ నుండి 20 సెం.మీ వర్షాన్ని సూచిస్తుంది. అలాగే ఎల్లో అలర్ట్ 6 నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతానికి సూచనగా నిలుస్తుంది.