
Hindupuram Balayya | 2019 సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి అది అవమానకర పరిస్థితి. టీడీపీ బడా నాయకులు కూడా వైసీపీ హవాలో ఓటమి రుచిని చవిచూశారు. అంతటి వైసీపీ తుఫానులో కూడా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ టీడీపీ తరపున గెలిచారు. ఎందుకంటే హిందూపురం తెలుగుదేశం కంచుకోట.
బాలయ్య గెలుపు కూడా భారీ మెజారిటీతో సాధించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురంలో రెండుసార్లు టిడీపీనే గెలిచింది. ఆ రెండు సార్లు నందమూరి బాలకృష్ణనే విజేత. ఈ పరిస్థితి మళ్లీ రాకుండా అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటి నుంచి కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఈ సారి హిందూపురంలో ఎలాగైనా గెలవాలనే వైసీపీ పట్టుదలతో ఉన్నట్లు వినిపిస్తోంది.
మరి కొన్ని నెలల వ్యవధిలోనే ఏపీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఈ సారి టీడీపీ కంచుకోట బద్దలు కొట్టాలని వైసీపీ ప్లానింగ్ చేస్తోంది. అందుకే పార్టీలకతీతంగా ఈ నియోజకవర్గంలో అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తోంది. వైసీపీ నాయకులు ఎప్పటికప్పుడు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
మరోవైపు బాలయ్య ఎప్పుడూ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. ఆయన సినిమాలు, బసవతారకం కాన్సర్ ఆస్పత్రి పనులతో ఎంత బిజీగా ఉన్నా.. హిందూపురం ప్రజల కోసం సమయం కేటాయిస్తారు. అందుకే ఈసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలనే టార్గెట్‌తో ఉన్నారు. కానీ వైసీపీ వర్గం ఆయనను ఓడించడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది.
తాజాగా హిందూపురం నియోజకర్గంలో జరిగిన వైసీపీ బస్సు యాత్ర కార్యక్రమంలో వైఎస్ జగన్ వర్గం ఇదే విషయాన్ని వినిపించింది. రాబయే ఎన్నికల్లో హిందూపురంలో బాలయ్య తప్పకుండా ఓడిస్తామని యాత్ర కొనసాగిన ప్రతిచోటా చెప్పారు. వైఎస్ జగన్ పాలనతో టీడీపీ కంచుకోటను బద్ధలుకొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి జయరాం పదే పదే ప్రచారంలో చెబుతున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే బాలయ్యను ఓడించడానికి వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ విషయంలో బాలకృష్ణ కూడా అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే ఈ సారి హిందూపురం ఎన్నికలలో నందమూరి సెంటిమెంట్ పనిచేయకపోవచ్చు.
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో టిడీపీ నాయకులకు షాక్ తగిలినట్టు అయింది. దీంతో నారా లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. బాలయ్య కూడా హిందూపురం నియోజకవర్గంలో మునుపటిలా ఉండడం లేదు. ఈ పరిస్థితులని వైసీపీ బాగా ఉపయోగించుకుంటోంది. ఇలాగే కొనసాగితే వైసీపీ పైచేయి సాధించడం కష్టం కాదేమో!