Vangalapudi Anitha: మొన్న విమర్శలు, నిన్న యాక్షన్, నేడు ప్రశంసలు.. ఇలా ఉంది ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ల మధ్య పొలిటికల్ సైలెంట్ వార్ తీరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మొన్నటికి మొన్న పిఠాపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ దుమారం అంతా ఇంతా కాదు. కూటమిలో భాగమైన జనసేన అధ్యక్షుడిగా గల పవన్ రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిగతులపై ఓ రెచ్చిపోయారు. అలాగే హోం మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి, జిల్లా వారీగా సమీక్షలు చేయాలని, పరిస్థితులు చేయి దాటితే తానే హోం మంత్రి పదవిని అడగాల్సి వస్తుందనే రేంజ్ లో మాట్లాడారు. తానే హోం మంత్రినైతే అసలు ఇలా ఉండదు.. నా స్టైల్ వేరే అనే లెవెల్ లో మాట్లాడారు.
ఇలా పవన్ చేసిన కామెంట్స్ పై హోం మంత్రి ఆచితూచి స్పందించారు ఆరోజు. హోం మంత్రి వైఫల్యం ఉందని పవన్ ఎక్కడా అనలేదని, కేవలం పోలీస్ అధికారుల తీరు గురించి మాత్రమే విమర్శించారన్నారు. పవన్ ఏ కేసులో అంత సీరియస్ గా ఉన్నారో తనకు తెలుసని, త్వరలోనే పవన్ ను కలిసి అన్ని విషయాలు చర్చిస్తానంటూ హోం మంత్రి తెలిపారు.
అయితే ఈ రెండు రోజుల్లో ఏపీ పోలీసులు స్పీడ్ పెంచారని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ సోషల్ మీడియా ట్రోలర్స్ అరెస్టుల పర్వానికి శ్రీకారం చుట్టారు పోలీసులు. అంతేకాదు మహిళలపై అఘాయిత్యాలు అనే మాట రాకుండా రాత్రి వేళ గస్తీ కూడా పెంచారు. మహిళలపై దాడులకు సంబంధించి సీరియస్ యాక్షన్ తప్పదంటూ పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరుణంలో పోలీసుల చర్యల పట్ల కూటమి నేతలు కూడా హ్యాపీ అయ్యారట.
Also Read: AP Politics: వాళ్లను వదిలిపెట్టనంటున్న చంద్రబాబు.. షర్మిళ మద్దతు.. కుదరదంటున్న జగన్
ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను హోం మంత్రి అనిత మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిగతులు, చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో తీసుకున్న చర్యల గురించి అనిత వివరించారు. పవన్ తో భేటీ అయిన ఫోటోలను హోం మినిష్టర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. మొత్తం మీద హోం శాఖ చర్యలపై తీవ్ర నిరాశతో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ తాజా పరిస్థితులపై హర్షం వ్యక్తం చేసి, పోలీసుల తీరును మెచ్చుకున్నట్లు సమాచారం.