ఉచిత బస్సు పథకం ఏపీలో మహిళలకు ఏ స్థాయిలో ఉపయోగకరమో వివరించారు టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు. అయితే ఆయన కాస్త హ్యూమర్ జోడించి ఓ ఉదాహరణ చెప్పారు. ఇప్పటి వరకు భర్తలు కసురుకున్నా, కోప్పడ్డా భార్యలు సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉందని, ఇకపై ఉచిత బస్సు పథకంతో వారికి మరో ఆప్షన్ కూడా ఉంటుందని చెప్పారు. భర్త కసురుకుంటే భార్య వెంటనే ఉచిత బస్సు ఎక్కి పుట్టింటికి వెళ్లొచ్చన్నారు. భార్యకోసం భర్త టికెట్ కొని మరీ బస్సులో రావాల్సి ఉంటుందన్నారు. అంటే ఈ పథకం అమలులోకి వచ్చాక, మునుపటిలా భార్యల్ని కోప్పడాలంటే భర్తలు ఆలోచించాల్సి వస్తుందనేది ఎమ్మెల్యే వ్యాఖ్యల సారాంశం. కానీ సహజంగానే ఇలాంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఎమ్మెల్యే మద్దిపాటి వ్యాఖ్యలు కూడా అలాగే సంచలనం అయ్యాయి. ఫ్రీ బస్సు పథకానికి ఎమ్మెల్యే ఇచ్చే వివరణ ఇదా అంటూ పలువురు సెటైర్లు పేలుస్తున్నారు. కాపురాల్లో చిచ్చు పెడుతున్నారంటూ ఒకింత కోపంగా కామెంట్లు పెడుతున్నారు.
చూశారా ….
భార్యలకు బస్సు ఫ్రీ ఇచ్చినట్టే ఇచ్చి…
ఆ డబ్బులను భర్తల ద్వారా లాగేయడానికి భలే సలహా ఇచ్చారు మా గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారు….! pic.twitter.com/e1tRDG47Bp
— DSR🦅 (@dakasrinu) August 3, 2025
ఉచిత బస్సులో వింతలు..
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత చిత్ర, విచిత్ర ఘటనలు ఎన్నో జరిగాయి. ఊసుపోక మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కినట్టు ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి, సీట్ల కోసం జుట్లు పట్టుకున్న సంఘటనలు కోకొల్లలు. డ్రైవర్లు, కండక్టర్లతో ప్రయాణికుల వాగ్వాదం, పరిమితిని మించిన ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బంది అవస్థలు అక్కడక్కడా కనిపించాయి. ఇప్పుడు ఇలాంటి సీన్లన్నీ ఏపీలో కూడా కనపడే అవకాశాలున్నాయి. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలుచేయబోతోంది కూటమి ప్రభుత్వం. దీంతో ఏపీలో కూడా ఇలాంటి వింతలు, విశేషాలు జరగడం సహజమేనని తెలుస్తోంది.
ఎవరికి ఉపయోగం..?
రోజువారీ పనులకు ఆర్టీసీ బస్సులపై ఆధారపడే వారికి, బస్సులు ఉన్నా కూడా ఆటోలను ఆశ్రయించే మహిళలకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. బస్సుల్లో ప్రయాణించే మహిళా ఉద్యోగులకు కూడా ఈ పథకం ద్వారా మేలు చేస్తుంది. నెలవారీ ప్రయాణ ఖర్చుల్ని ఆదా చేస్తుంది. వారంతా ఉచితంగా ప్రయాణం చేస్తూ, టికెట్ కి పెట్టే ఖర్చుని మరో అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అటు ఆర్టీసీకి కూడా ఇది లాభదాయకమే. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, ఆమేరకు రాయితీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తే ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుతుంది.
సమస్యలు ఉంటాయా?
ఉచిత బస్సు ప్రయాణం మొదలైతే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయనడంలో సందేహం లేదు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కితే సీట్ల దగ్గర గొడవలు జరగడం సహజం. అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణించేవారు ఈ పథకాన్ని దుర్వినియోగపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. చివరిగా ప్రతిపక్ష వైసీపీకి కూడా ఇది ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ పథకం సక్సెస్ అయితే కూటమి ప్రభుత్వ మైలేజీ మరింత పెరుగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఉచిత బస్సు పథకాన్ని కచ్చితంగా కొనసాగిస్తామని జగన్ హామీ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఆ పథకాన్ని ఆయన మెచ్చుకోవాల్సిందేననమాట.