Marriages in Telugu States :
⦿ గత ఏడాది కన్నా రెట్టింపైన పెళ్లి ఖర్చులు
⦿ డిసెంబర్ నెలలో 13 పెళ్లి ముహూర్తాలు
⦿ రెండు తెలుగు రాష్ట్రాలలో పెళ్లి సందడి
⦿ ఫంక్షన్ హాల్స్‌కు భారీగా డిమాండ్
⦿ భారత్‌లో ఏటా 80 లక్షల నుంచి కోటి పెళ్లిళ్లు
స్వేచ్ఛ స్పెషల్: ప్రతి ఒక్కరికీ జీవితంలో అందరి సమక్షంలో చేసుకునే పెళ్లిరోజు అదొక మధురానుభూతి. ఆ జ్ణాపకాలను వృద్దాప్యం వచ్చే దాకా తీపి గుర్తులుగా మలుచుకునే దివ్యమైన రోజు. అందుకే కొందరు డబ్బున్న శ్రీమంతులు వేల సంఖ్యలో బంధుమిత్రులను పిలిచి కనీవినీ ఎరుగని రీతిలో వివాహం చేసుకుంటారు. మధ్య తరగతి వర్గం వారికున్న దాంట్లోనే ఘనంగా వందల్లో బంధుమిత్రులను ఆహ్వానించి పెళ్లి వేడుక చేసుకుంటారు. అసలు డబ్బులు ఖర్చు పెట్టేందుకు ఇష్టపడని వారు గుళ్లల్లో, రిజిస్టర్ మ్యారేజ్‌తో సరిపుచ్చుకుంటారు. ఇలా దారులు వేరైనా లక్ష్యం మాత్రం వివాహ బంధంతో ఒక్కటవ్వడమే.
త్వరపడండి..
రానున్న డిసెంబర్ నెలలో పెళ్లిళ్లు చేసుకునేవారికి గట్టిగానే శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. డిసెంబర్ 4 నుంచి 7 వరకూ వరుసగా మంచి ముహూర్తాలు ఉన్నాయి.10,11,14, 20, 22, 24, 25 తేదీలలో కూడా మంచి ఘడియలు ఉన్నాయి. మొత్తానికి వచ్చే ఈ 13 రోజుల ముహూర్తాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద కొన్ని వేల జంటలు ఒక్కటి కాబోతున్నాయి. అయితే జనవరి నెలలో మంచి ముహూర్తాలు లేవని, మళ్లీ మాఘమాసంలోనే ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరుపుకుని మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న జంటలకు ఈ డిసెంబర్ నెలలో ఏకంగా 13 రోజుల మంచి ముహూర్తాలు దొరకడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భలే గిరాకీ
పెళ్లి ముహూర్తాలు దగ్గరపడటంతో ఫంక్షన్ హాళ్లకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇక పంతుళ్లు, మేళ తాళాలు, బ్యాండ్ బాజాలు, క్యాటరింగ్, టెంట్లు తదితర కార్యక్రమాలు తప్పనిసరి కాబట్టి వీటికి బాగా డిమాండ్ ఏర్పడింది. ఇక మండపం సెట్లు వేసే కార్మికులు కూడా ఈసారి భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు ఉండే డిమాండ్ మామూలుగా లేదు. మంచి ఎక్స్‌పర్ట్ వీడియో గ్రాఫర్ కోసం కొన్ని నెలల ముందుగానే ఒప్పందం చేసుకోవాలి. ఈ మధ్య వెడ్డింగ్ షూట్ అంటూ పాన్ ఇండియా తరహాలో గ్రాఫిక్స్ జోడించి, అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో డబ్బులు ఎంతైనా ఫర్వాలేదని, దాదాపు పెళ్లికి ఎంతవుతుందో అంతకు మించి వెడ్డింగ్ షూట్లకు ఖర్చుపెడుతున్నారు.
ఏటా రూ.10 లక్షల కోట్లు
కేవలం పెళ్లిళ్ల కోసమే భారతీయులు ఏటా రూ.10 లక్షల కోట్లు ఖర్చుపెడుతున్నారని ఓ సర్వే సంస్థ జెఫరీస్ తెలియజేసింది. భారత దేశంలో విద్యార్థుల చదువుల మీద కన్నా వారి వివాహంపైనే డబుల్ ఖర్చులు పెడుతున్నట్లు తేలింది. అంతేకాదు ఏటా ఒక్క భారత్‌లోనే 80 లక్షల నుంచి కోటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అమెరికాలో 70 మిలియన్ల పెళ్లి కోసం ఖర్చుపెడుతుంటే అంతకు రెట్టింపు స్థాయిలో భారత్‌లో ఖర్చుపెడుతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒకప్పుడు ఇండియాలో పెళ్లిళ్లు అంటే ఐదు రోజులు తప్పకుండా చేసేవారు. బంధుమిత్రులందరినీ ఐదు రోజులుండేలా బస ఏర్పాటు చేసి, వారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకునేవారు. మరి ఇప్పుడు బాగా డబ్బున్న శ్రీమంతులే సంగీత్ అంటూ, పెళ్లి, రిసెప్షన్ అంటూ రెండు మూడు రోజులు అత్యంత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో వివాహ వేడుకలు జరిపిస్తున్నారు. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలు ఇవేమీ లేకుండానే పెళ్లికి వచ్చి అక్షింతలు వేస్తే చాలనునకొని ఆ పూటకు మాత్రమే భోజన కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు. దూర ప్రాంతాలనుంచి వచ్చే వారు సైతం వారి ఏర్పాట్లు వాళ్లు చేసుకుని ఒక్క పూట ఉండి నూతన జంటను ఆశీర్వదించి వెళ్లిపోతున్నారు.
Also Read : మద్యం తాగి రోడ్లపైకి వచ్చారో.. ఇక అంతే సంగతలు.. ట్రాఫిక్ పోలీసుల నజర్
భోజనాలకే..
ఒక్క భోజనాల ఖర్చే ప్లేటు రూ.500 నుంచి రూ. 2 వేలు ఖర్చుపెడుతున్నారు. ఇందులో మళ్లీ వెజ్, నాన్ వెజ్ అని చాలానే ఉంటాయి. ఇక వెజ్ అయితే గట్టిగానే వంటకాలు ఉంటాయి. నాన్ వెజ్ అయితే ముక్కకు తోడు సుక్క పడాల్సిందేనని డిమాండ్ కూడా గట్టిగానే ఉంటోంది. అటు వెజ్, ఇటు నాన్‌వెజ్‌లో వేస్ట్‌గా పారేసేదే ఎక్కువ అని ఈ మధ్య ఎవరినోట చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఇక ఏ ఏటికా ఏడాది వస్త్రాల రేట్లు కూడా రెట్టింపు అవుతున్నాయి. పెళ్లి మండపం ఒక్క రోజుకే రూ. లక్ష నుంచి 10 లక్షల వరకూ ఉంటోందంటే వివాహ ఖర్చులు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనే సామెత ఊరికే పుట్టలేదు.