EX CM Jagan Mohan Reddy news(AP political news): ప్రతీ ఓటమి కూడా గెలుపునకు పునాది కావాలి అంటారు. అయితే.. ఆ ఓటమిని నిజంగానే పునాదిగా మార్చుకోవాలి. మనం చేసిన తప్పులను గ్రహించి.. వాటిని సరిదిద్దుకోవాలి. అప్పుడే గెలుపు దిశగా పయనించాలి. అలా కాకుండా అసలు ఓటమని అంగీకరించ లేకపోతే మన ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పరిస్థితి కూడా అంతే. ప్రజలందరికీ న్యాయం చేశాం.. వైసీపీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాం. అద్బుతమైన పాలన అందించామని జగన్ చెబుతున్నారు. కానీ.. ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఈ మాటలు అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీలతో జరిగిన మీటింగ్‌లో కూడా ఇవే కామెంట్స్ చేశారు.
ఫలితాలు వెలువడిన వెంటనే ఓటమికి కారణాలను విశ్లేషించుకోలేకపోవచ్చు. కానీ.. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన 10 రోజులు అవుతోంది. ఇప్పటికీ కూడా ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలియడం లేదు. దేవుడికే తెలియాలి అంటున్నారంటే.. ఓటర్లను నిందించే ప్రయత్నం చేస్తున్నట్టే. ఎంత చేసినా.. నాకు ఎందుకు ఓట్లు వేయలేదని ప్రశ్నిస్తున్నట్టే. నిజంగానే జగన్ చెబుతున్నట్టు వైసీపీ పాలనలో 2 లక్షల 70 వేల రూపాయలు పలు సంక్షేమ పథకాల రూపంలో ప్రజల బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. ఆ 2 లక్షల 70 వేల రూపాయలకే జనం ఓట్లు వేయాలా ? అమలు చేసిన మంచి పనుల గురించే మాట్లాడుతున్న జగన్.. హామీ ఇచ్చి వాటి గురించి ఆలోచన కూడా చేయని వాటి సమాధానం చెప్పడం లేదు. తన పాలనలో తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక చర్యల గురించి మాట్లాడటం లేదు.
Also Read : మన ప్రధానిలో మార్పొచ్చింది.. ఏపీకి స్వర్ణయుగం వచ్చినట్లేనా ?
సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్ష అని జగన్ అనుకొని ఉండొచ్చు. కానీ.. అవే రాష్ట్రానికి కర్ణుడి శాపంగా మారాయని ఆయన అర్థం చేసుకోవడం లేదు. రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందనే అంగీకరించడం లేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇలా చాలా అంశాలు జగన్ పాలనను అట్టర్ ప్లాప్ చేశాయి. మా అక్క, చెల్లెమ్మ అని ఆయన క్రమం తప్పకుండా వారి అకౌంట్లోకి సంక్షేమ పథకాల నిధులు వేసి ఉండోచ్చు. కానీ.. అదే అక్క, చెల్లెమ్మలకు జగన్ అన్న ఇచ్చిన డబ్బుతో వచ్చిన సంతోషం కంటే.. తన ఇంట్లో ఉండే పిల్లలు నిరుద్యోగులుగా మిగిలిపోయారనే బాధ ఎక్కువ ఉంటుంది. తన ఇంటి యజమాని క్వాలిటీ లేని మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారనే ఆవేదన ఉంటుంది. మహిళలు ఓటు వేయడానికి వెళ్లినపుడు ఇవే అంశాలను ప్రభావితం చేశాయి.
మరోవైపు ఇప్పుడు ప్రతీరోజూ వైసీసీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్న జగన్.. అధికారంలో ఉన్నపుడు ఎన్ని సార్లు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉన్నారో ఆయనే సమాధానం చెప్పుకోవాలి. సీఎంగా ఉన్నపుడు ఖాళీ సమయం దొరకదు అనేది నిజమే. కానీ, పార్టీ నేతలతో తనకు పని లేదు.. ప్రజలు తనను చూసే ఓటు వేస్తారనే దోరణి ఆయన్ని దహించేసిందని చెప్పడంలో అనుమానం లేదు. కానీ, జగన్ ఈ విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నారు.
జగన్ తప్పులను వేలెత్తి చూపించి ఆయన్ని తగ్గించే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. ఎందుకంటే.. ప్రజలే ఊహించని ఫలితాన్ని ఇచ్చి ఆయనను అధ:పాతాళానికి తొక్కేశారు. కొత్తగా ఆయన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ.. ఆ విషయాన్ని జగన్ గ్రహించుకుంటే పార్టీని నిలబెట్టుకోవచ్చు. నిజానికి జగన్ కు కష్టాలు కొత్త కాదు. కష్టాలు ఎదుర్కొని నిలబడటం కూడా కొత్త కాదు. కానీ.. వాస్తవాలను గ్రహించ లేకపోతే.. తను చేసిన తప్పులను అంగీకరించ లేకపోతే ముందుకు వెళ్లడం సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించ లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ తన ఉనికినే కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.