TTD Treasury: తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు 121 కిలోల బంగారం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఎవరు ఆ భక్తుడు.. ఏంటా కథ అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ టాపిక్ తో వెంకన్న బంగారు కొండ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వామివారి ధన సంపత్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో ఏకంగా 140 కోట్ల రూపాయల విలువైన బంగారం స్వామి వారికి అందుతుండడం ఇదే తొలిసారి కావడంతో అందరినీ ఆకర్షిస్తోంది.
స్వామి వారికి రాజుల దగ్గర్నుంచి కానుకలు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధి నిత్య కల్యాణం.. పచ్చతోరణం అన్నట్లుగా శోభాయమానంగా ఉంటుంది. స్వామి వారికి భక్తుల కానుకలు ఎన్నెన్నో సమర్పించుకుంటుంటారు. నాటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి.. పల్లవ, చోళ, రెడ్డి రాజవంశాలు, బ్రిటిషర్లు, నిజాం పాలకులు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆధునిక యుగం వరకూ వెలకట్టలేని కానుకలను దైవ భక్తితో సమర్పించుకున్న వారెందరో. అయితే ఆధునిక కాలంలో తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తితో ఓ అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారం సమర్పించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకే చెప్పారు. ఆ బంగారం విలువ 150 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. P4 కార్యక్రమం సందర్భంగా సీఎం ఈ విషయాన్ని అందరికీ చెప్పడం కీలకంగా మారింది. చెప్పాలంటే రాజుల కాలం తర్వాత ఆధునిక యుగంలో ఒకే వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారికి బంగారం సమర్పించుకోవడం ఇదే తొలిసారి. అందుకే ఈ టాపిక్ హాట్ టాపిక్ అయింది.
సంపద రావడం వెంకన్న పుణ్యమే అన్న భక్తుడు
విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణ దేవరాయలు మొదలుకుని చాలా మంది రాజులు ఇచ్చిన వజ్రాభరణాలు, మణిమాణిక్యాలు, రత్నాలు, కెంపులు, హారాలు, వజ్రాలు, వైఢూర్యాలు.. ఇవన్నీ మన ఇప్పటి లెక్కకు అందవు. వీటి ప్రాచీన పురాతత్వ విలువ ఎవరికీ అందదు కూడా. అయితే ఇప్పుడు అజ్ఞాత భక్తుడు ఇవ్వాలనుకుంటున్న 121 కిలోల బంగారం చుట్టూ అల్లుకున్న విషయాన్ని సీఎం చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. వెంకటేశ్వరస్వామి భక్తుడొకరు కంపెనీ పెట్టారని, అది చాలా పెద్దస్థాయికి వెళ్లడం, అందులో 60 శాతం అమ్మగా ఆయనకు ఆరేడువేల కోట్ల రూపాయలు రావడం.., ఆ సంపద తనకు వెంకన్న ఇచ్చిందే అని ఆయన నమ్మడం, అందులో కొంత స్వామికే తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకోవడంతోనే 121 కిలోల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. వెంకటేశ్వర స్వామికి రోజూ 120 కిలోల ఆభరణాలను అలంకరిస్తారు. ఆ భక్తుడి ద్వారా అంతకంటే ఒక్క కిలో ఎక్కువ ఇప్పించుకోవాలని స్వామి నిర్ణయించుకున్నారో ఏమోగానీ.. అచ్చంగా అదే విశేషం జరిగింది. ఇటీవలి కాలంలో భక్తుల పెద్ద ఎత్తున విరాళం ఇచ్చినవి చూస్తే.. 2009లో గాలి జనార్దన్ రెడ్డి 42 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని స్వామికి సమర్పించారు. ఎక్కువ బరువు ఉండడంతో దీన్ని వాడటం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక… కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5.2 కోట్ల రూపాయల విలువైన 19 కిలోల బరువున్న రెండు స్వర్ణాభరణాలు అందించి మొక్కు తీర్చుకున్నారు.
శ్రీవారి అలంకారానికి 1100 బంగారు ఆభరణలు..
ప్రవాసాంధ్రుడు రామలింగరాజు ఇచ్చిన 11 కోట్ల విరాళంతో శ్రీవారికి కొత్త సహస్రనామ కాసుల బంగారు హారాన్ని తయారు చేయించారు. మొత్తంగా శ్రీవారిని అలంకరించేందుకు సుమారు 1100 బంగారు ఆభరణాలు, 376 వజ్ర వైడూర్యాల నగలు ఉన్నాయి. బంగారు ఆభరణాల కానుకలు పెద్ద ఎత్తున వస్తుండటంతో.. టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందస్తు అనుమతితో నిబంధనల ప్రకారమే ఈ కానుకలు ఇవ్వాలన్నది. దీంతో హుండీ ద్వారా బంగారు కానుకలు రావడం ఎక్కువైంది. ఏటా హుండీ ద్వారానే సుమారు టన్ను బంగారం వస్తున్నట్లు చెబుతున్నారు. స్వామివారి అలంకరణలకు ఉపయోగించేవి అలాగే ఉంచి.. ఇతర ఆభరణాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ వస్తున్నారు. వీటిపైనా టీటీడీకి వార్షిక వడ్డీ రూపంలో ఆదాయం వస్తోంది.
టీటీడీ దగ్గర 11,329 కిలోల బంగారం
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న హిందూ ఆలయం. ఇక్కడ సంపదకు కొరత లేదు. భక్తులకు కొదవ లేదు. స్వామివారి అనుగ్రహ కటాక్షం కోసం భక్తజనం పరితపిస్తూనే ఉంటుంది. కోరిన కోర్కెలు నెరవేరగానే.. చాలా మంది ధన కనక వస్తు రూపంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు. అందుకే ఏడు కొండల వాడి సన్నిధి బంగారు కొండ అయింది. అసలు తిరుమల శ్రీనివాసుడి దగ్గర ఎంత బంగారం ఉంది? ఎక్కడెక్కడ ఉంది? 2024 నాటి లెక్కల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర మొత్తం 11 వేల 329 కిలోల బంగారం ఉంది. ఇందులో బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన గోల్డ్, అలాగే ఆలయ ఖజానాలో ఉన్న బంగారం ఉన్నాయి. 2023లో శ్రీనివాసుడికి ఏకంగా 1,031 కిలోల స్వర్ణాన్ని భక్తజనం సమర్పించుకుంది. ఆలయ చరిత్రలో ఒక ఏడాది కాలంలో ఇంతలా బంగారం విరాళాలు రావడం అదే తొలిసారి. స్వామివారికి ఒక్క బంగారం వాల్యూనే 12 వేల కోట్ల రూపాయల దాకా ఉంటుంది.
గోల్డ్ డిపాజిట్లపై 2.5% వార్షిక వడ్డీ
శ్రీదేవి, భూదేవి సమేతుడై ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించగా మిగిలిన గోల్డ్ ను గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ కింద జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం మొదలు పెట్టింది టీటీడీ. ఎందుకంటే వీటిపై కూడా టీటీడీకి ఆదాయం లభిస్తోంది. ఈ డిపాజిట్లు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ స్కీమ్‌ల కింద డిపాజిట్ చేశారు. ఈ గోల్డ్ పై 2.5% వార్షిక వడ్డీ అందుతోంది. 2019 నాటి డేటా ప్రకారం చూస్తే SBIలో 5,387 కిలోలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర 1,938 కిలోలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర 1,311 కిలోల బంగారం డిపాజిట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తిరిగి తీసుకున్నారు. 2019-2022 మధ్య TTD 4 వేల కిలోల బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. అటు 2019 నాటికి TTD ఖజానాలో 1,934 కేజీల గోల్డ్ ఉంది. ఇందులో 553 కిలోలు చిన్న ఆభరణాలు ఉన్నాయి. ఇవి ఈ ఏడాదికి చాలా పెరిగి ఉంటాయి.
2024 నాటికి రూ.18 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు
TTD వివిధ బ్యాంకుల్లో 2024 నాటికి 18 వేల కోట్ల రూపాయలను ఫిక్స్ డ్ డిపాజిట్ కింద జమ చేసింది. వీటితో ఏటా సుమారు 1,200 కోట్లు వడ్డీ వస్తోంది. అటు బంగారం డిపాజిట్లపై 2.5 శాతం వడ్డీ రేటు ప్రకారం, TTDకి ఏటా సుమారు 278 కోట్ల రూపాయలు వస్తోంది. హుండీ సహా ఇతర ఆదాయ వనరులు ఏటా యావరేజ్ గా 1,600 కోట్లుగా ఉంది. ప్రసాదాల అమ్మకం అంటే లడ్డూ, వడల ద్వారా 600 కోట్లు వస్తుంటాయి. భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాల అమ్మకం ద్వారా ఏటా యావరేజ్ గా 151 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దర్శన టికెట్లతో ఏటా 338 కోట్లు వస్తాయి. సో ఓవరాల్ గా టీటీడీ నికర ఆస్తుల విలువ 3 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి రోజువారీ ఆచారాలు పండుగల సమయంలో ఉపయోగించే బంగారు ఆభరణాలు చాలానే ఉంటాయి. ఇందులో స్వామి వారి ప్రధాన విగ్రహం, ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి కోసం ఉపయోగించే ఆభరణాలు ఉన్నాయి. ముఖ్యమైన వాటిలో సూర్య కటారి, నందకం, శ్రీవారి అభయ హస్తం, కటిహస్తాలు, బంగారు కిరీటం, ఆకుపచ్చహారం, బంగారు హస్తాలు, వైజయంతి మాల ఇలాంటివెన్నో ఉన్నాయి. ఆనంద నిలయం గోపురమంతా బంగారు తాపడం చేశారు.
Also Read: ధర్మస్థల మాస్ బరియల్ కేసులో బిగ్ ట్విస్ట్..
శ్రీనివాసుడి ఆలయంలో గర్భగుడిలో ఉన్న ప్రధాన విగ్రహం, అలాగే ఉత్సవ మూర్తులపై ఉన్న వజ్రాలతో కూడిన బంగారు ఆభరణాలు, మణిమాణిక్యాల పురాతత్వ విలువ అంచనాలకు మించి ఉంటుంది. ఈ ఆభరణాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయరు. ఆలయ ఖజానాలోనే ఉంచుతారు. ఎందుకంటే ఇవి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి రాజులు, రాజవంశాలు ఇస్తూ వచ్చినవి కావడమే. 1517లో శ్రీవారికి భారీగా కానుకలు సమర్పించుకున్న విజయనగర రాజు కృష్ణదేవరాయలు అదే సమయంలో తన విగ్రహాన్ని ఆలయంలో స్థాపించారు. ఇక భక్తులు హుండీలో సమర్పించే బంగారం, నగదు, ఆభరణాలు, ఆస్తి పత్రాలు, షేర్లు కూడా ఆలయ సంపదలో భాగమే.