Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వచ్చే వేలాది మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు టీటీడీ ఏఐను వినియోగించనుంది. ఎన్‌ఆర్‌ఐల దాతృత్వంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీసీను అందుబాటులోకి తెచ్చింది.
నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
అంటే దాదాపు 30 కోట్ల రూపాయలతో వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనుంది. ఈ కేంద్రాన్ని నేడు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
25 మందికిపైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భక్తుల రద్దీని అంచనా వేయడం, ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తింపు, సైబర్ దాడులను అడ్డుకోవడం వంటి చర్యలు తీసుకుంటారు. ఐసీసీసీలో 25 మందికి పైగా సిబ్బంది సీసీటీవీ ఫుటేజీలను పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తారు.
అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా
అలిపిరి నుంచే ఏఐ సాంకేతికతతో భక్తుల రద్దీని అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో ఎంతమంది ఉన్నారు? ఎంత సమయం వేచి ఉన్నారు? సర్వదర్శనం పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఏఐ ట్రాక్ చేస్తుంది.
ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తులను గుర్తింపు
ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో భక్తులను గుర్తుపట్టవచ్చు. చోరీలు, ఇతర నేరాలు జరిగినా వెంటనే గుర్తించవచ్చు. తప్పిపోయిన వారిని కూడా సులువుగా కనుగొనవచ్చు. భక్తుల ముఖ కవళికలను బట్టి వారి ఇబ్బందులను తెలుసుకునే అవకాశం ఉంది. క్యూలైన్లు, వసతి వంటి సౌకర్యాలను 3డీ మ్యాప్‌ల ద్వారా చూపిస్తారు. రద్దీగా ఉండే ప్రాంతాలను రెడ్ స్పాట్స్ ద్వారా గుర్తించి, వెంటనే చర్యలు తీసుకుంటారు.
చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా కనిపెట్టగల ప్రత్యేకత..
ఆన్‌లైన్‌లో వచ్చే సైబర్ దాడులను, టీటీడీ పరువు తీసేలా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను అడ్డుకుంటారు. తప్పుడు సమాచారాన్ని కూడా నిరోధిస్తారు. భక్తుల అనుభవాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, దర్శనాన్ని మరింత సులభతరం చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి దగ్గరి మార్గాలను చూపిస్తుంది.