అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత ఫ్లైట్ ఎక్కేవారిలో ఆందోళన మరింత పెరిగిందనే చెప్పాలి. ఫ్లైట్ లో ఎక్కడ ఏ చిన్న అలికిడి వినపడినా, ఏ చిన్న అలజడి జరిగినా అందరూ టెన్షన్ పడిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే స్పైస్ జెట్ విమానంలో జరిగింది. గోవా నుంచి పుణెకి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ప్రయాణికుల సీటు పక్కన ఉన్న ఒక విండో లోపలికి జారినట్టు అయింది. ఆ విండో పూర్తిగా తెరుచుకుంటుందేమోనని ప్రయాణికులు హడావిడి పడ్డారు. వెంటనే సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వారు ఆ సీటులో ఉన్న ప్రయాణికుల్ని మరోచోటకు మార్చారు. అయితే ఆ విండో పక్కకు జారడం వల్ల ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలాంటి ఘటనతో తాము భయపడిపోయామంటూ కొందరు ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అసలేం జరిగింది..?
జులై 1న గోవా నుంచి పుణెకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం SG-1080లో ఈ ఘటన జరిగింది. విండో ఫ్రేమ్ బయటకు వచ్చింది. దీంతో ఆ విండో పక్కన కూర్చున్న ప్రయాణికురాలు భయపడిపోయారు. ఆమెతోపాటు బిడ్డ కూడా ఉంది. దీంతో ఆమె మరింత ఆందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బందికి ఆ విషయాన్ని చెప్పారు. వారు సర్దిచెప్పాలని చూసినా ఆమె వినలేదు. ఆమె భయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే వేరే సీటు చూపించారు. బిడ్డతో సహా ఆమె మరో సీటులో కూర్చుని ప్రయాణించింది. ఈ ఘటనను మరో ప్రయాణీకురాలు మందార్ సావంత్ మీడియాకు చెప్పారు.
విండో ఫ్రేమ్..
అది ఒక విండో ఫ్రేమ్ అని తెలిపారు విమాన సిబ్బంది. దాని వెనక గట్టి అద్దం ఉంటుందని, అదే విండోకి ప్రధానమైనదని అంటున్నారు. అద్దానికి అదనపు రక్షణగా మాత్రమే ఫ్రేమ్ ఉంటుందని తెలిపారు. ఆ ఫ్రేమ్ పక్కకి తొలగినంత మాత్రాన ఏమీ జరగదని ప్రయాణికులకు భరోసా ఇచ్చారు. స్పైస్ జెట్ విమానం పుణె చేరుకున్న తర్వాత ఆ విండోని సరిగ్గా అమర్చారు. అది కేవలం నీడకోసమే ఆ కిటికీపై అమర్చి ఉంచుతారు. అది పక్కకు తొలగినంత మాత్రాన ఏమీ కాదు కానీ, ప్రయాణికుల్లో మాత్రం అలజడి రేగింది. అహ్మదాబాద్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రయాణికుల్లో ఒకరకమైన ఆందోళన ఉంది. అందుకే స్పైస్ జెట్ ఫ్లైట్ లో కేవలం కిటికీ పక్కకు తొలగగానే వారు భయపడ్డారు. అందులోనూ కిటికీ పక్కనే కూర్చుని ఉన్న ప్రయాణికురాలు మరింత ఆందోళనకు గురవడంతో సిబ్బంది ఆమెకు ధైర్యం చెప్పి సీటు మార్చారు.
ప్రాణాలతో చెలగాటమా..?
విమానంలో ఏయే భాగాలు కరెక్ట్ గా అమరి ఉండాలి, ఏవేవి సరిగా లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి అనే విషయాలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉంటుంది. ప్రయాణం ప్రారంభం కాకముందే అన్నీ వారు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ చెకింగ్ పూర్తయిన తర్వాతే ప్రయాణం మొదలు కావాలి. ఇక్కడ స్పైస్ జెట్ ది తప్పు అని నింద వేయలేం కానీ.. విండో సరిగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత సిబ్బందికి ఉంది. ఆ విండోతో ప్రమాదం ఏమీ లేదని వారు చెబుతున్నా ప్రయాణికులు భయపడితే అప్పుడు మరింత గందరగోళం ఏర్పడుతుంది. ఇకనైనా ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరక్కుండా విమానయాన సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటాయని ఆశిద్దాం.