Sajjala – Vijayasai reddy : వైసీపీ పార్టీలో జగన్ దగ్గర ఎవరు ఏం మాట్లాడాలన్నా, ఆయన్ను కలవాలన్నా.. చుట్టూ కోటరి అనుమతి తీసుకోవాలి. వాళ్లుకు ఏదోలా ఆర్థిక ప్రయోజనమో, ఇతర ప్రయోజనాలు కల్పిస్తేనే అధినేతను కలిసేందుకు అనుమతి లభిస్తుంటుంది. లేదంటే.. జగన్ ను కలవడం ఎవరి వల్లా కాదు. అందుకే.. ఆయన క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని పూర్తిగా అంచనా వేయలేక, ఎన్నికల్లో ఘోరంగా ఓటిపోయారు… అవీ మాజీ వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్న మాటలు. అంతే కాదు.. జగన్ కోసమే పని చేసిన తనను నమ్మక ద్రోహి అన్నట్లు ఆరోపించారని, తన మనస్సును ముక్కలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తానికి జగన్ చుట్టూ ఉండే కోటరీనే కారణం అంటూ ఆరోపణలు చేశారు. సాయి రెడ్డి.. టార్గెట్ చేసుకుని విమర్శలు చేసింది ఎవరినై ఉంటుంది అనే చర్చ..వైసీపీ వర్గాలతో పాటుగా, రాష్ట్ర రాజకీయాల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది. కాగా.. ఈ వ్యవహారం గురించి తెలిసిన వాళ్లు మాత్రం.. సాయిరెడ్డి అంటుంది సజ్జల రామకృష్ణ రెడ్డి గురించే అని చెప్పుకుంటున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన మొత్తం వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకున్న విజయసాయి రెడ్డి.. పార్టీ తరఫునా యాక్టీవ్ గా పని చేశారు. తొలిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వరకు ఆయనే పార్టీ విధానాలపై మాట్లాడేవారు. జగన్ తీసుకునే ఏ నిర్ణయాల్ని అయినా సాయి రెడ్డే దగ్గరుండి నెరవేర్చే వారని టాక్. అలాంటి వ్యక్తికి.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు ఎదురయ్యాయి. క్రమంగా.. జగన్ సాయి రెడ్డి ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చారు. ఎమ్మెల్యే టికెట్ కోసం విశాఖలో అనేక కార్యక్రమాలు చేసినా.. చివరికి ఆయనకు ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించలేదు. మరోసారి రాజ్యసభకే పంపించారు. అలా.. కొద్ది కొద్దిగా జగన్, సాయిరెడ్డి మధ్య పెరిగిన మనస్పర్థలు.. పార్టీ ఓటమి తర్వాత మరింత పెరగాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
జగన్ మోహన్ రెడ్డి అత్యంత విశ్వసనీయ నాయకుల్లో ఒకడిగా ఉన్న విజయ సాయిరెడ్డిని పార్టీ కార్యక్రమాలకు కొంచెం కొంచెంగా దూరం పెట్టేశారు. పైగా.. ఆయన చెప్పిన వ్యూహాలకు, ఎన్నికల ప్రణాళికలకు సంబంధించిన విషయాల్లో మాట పారనీయలేదని చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం సజ్జలే అంట. జగన్ టీమ్ లో వేగంగా ఎదిగిన సజ్జల రామ కృష్ణా రెడ్డి.. జగన్ కు అత్యంత ఆప్తుడిగా, సన్నిహితుడిగా మారిపోయారు. ఎంతలా అంటే.. ఆయన్ను సకల శాఖ మంత్రిగా విపక్షాలు టార్గెట్ చేసేంతలా.. సజ్జల హవా నడిచింది. ఈ సమయంలో.. జగన్ కు సాయి రెడ్డికి మధ్యలో అనేక విషయాల్లో సజ్జల నిప్పు రాజేశారని సాయిరెడ్డి వర్గం ఆరోపిస్తోంది.
సాయిరెడ్డి హెచ్చరికలను పట్టించుకోని జగన్?
విజయసాయిరెడ్డి గత రెండేళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్న ప్రజాభిప్రాయం గురించి జగన్‌కు అనేకసార్లు వివరించారని పార్టీ వర్గాల టాక్. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి, సామాజిక వర్గాల నుంచి పెరుగుతున్న వ్యతిరేకత, ఆర్థిక సంక్షోభం, కొన్ని విషయాల్లో ప్రభుత్వం అనుసరించిన మొండి తటస్థ వైఖరి వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని హెచ్చరించారంట. ఎన్నికలకు ముందు భూముల రీసర్వే, మూడు రాజధానులు సహా కొన్ని విషయాల్లో సాయి రెడ్డి హెచ్చరించినా పట్టించుకోలేదంట.
జగన్ అలా వ్యవహరించేందుకు సజ్జలే ప్రధాన కారణం అంటున్నారు. ఆయనే జగన్ దగ్గరగా ఉంటూ.. సాయిరెడ్డిని, అతని అనుచరుల్ని దూరం చేశారని అంటున్నారు. ఎవరెంత చెప్పినా.. సజ్జల మాటకే విలువిచ్చి జగన్ తన విధానాన్ని మార్చుకోలేదని సమాచారం. సాయిరెడ్డి పార్టీని బలోపేతం చేయడానికి స్ట్రాటజీ మార్పు అవసరం అని చెబితే, జగన్ ఇది పొలిటికల్ సెంటిమెంట్ మాత్రమే, ఎన్నికల నాటికి ప్రజలు తిరిగి మద్దతివ్వడం ఖాయం అంటూ నిర్లక్ష్యం చూపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సజ్జల–సాయిరెడ్డి మధ్య విభేదాలే కారణమా?
పార్టీలో ప్రభావవంతమైన వ్యక్తిగా సజ్జల రామ కృష్ణారెడ్డి ఎదగడమే.. సాయి రెడ్డి పార్టీ నుంచి కొంత జరగడానికి కారణం అంటున్నారు. వైసీపీ నియంత్రణ పూర్తిగా సజ్జల చేతుల్లోకి వెళ్లడం, ముఖ్యంగా మీడియా మేనేజ్‌మెంట్, పాలనాపరమైన నిర్ణయాల్లో సజ్జల హవా పెరగడం వల్ల సాయిరెడ్డి జగన్‌కు అందుబాటులో లేకుండా పోయారని ఆంతరంగికంగా చర్చ జరుగుతోంది. ఇక, పార్టీ ఓటమి స్పష్టమవుతున్నప్పటికీ.. సజ్జల జగన్ ను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని, అంతర్గతంగా, బయట నడుస్తున్న చర్చను లైట్‌గా తీసుకున్నారని కూడా ఓ వర్గం ఆరోపిస్తోంది. అదే సమయంలో, సాయిరెడ్డి మాత్రం ఓటమిని ముందే ఊహించి, అదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన మొండి వైఖరి ప్రదర్శించారని అంటున్నారు.
ఓటమి తర్వాత జగన్ వైఖరి మారిందా?
ఎన్నికల ఫలితాలు వచ్చాక.. విజయ సాయి రెడ్డి పార్టీ కార్యక్రమాలపై పెద్దగా స్పందిచకపోవడం, పార్టీ ఆలోచనల గురించి మీడియాలో మాట్లాడకపోవడం వంటివి జగన్ దృష్టికి వెళ్లాయని అంటున్నారు. ఓటమికి అసలు కారణాలు తేల్చాలని సాయిరెడ్డి సూచించినా, జగన్ మాత్రం ఆ విషయాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా, పార్టీ కీలక నిర్ణయాల్లో సాయిరెడ్డికి ఎలాంటి కీలక పాత్ర ఇవ్వకుండా ఆయనను పక్కన పెట్టినట్లు అర్థమవుతోంది.
Also Read : Vijayasai Reddy : జగన్ ఆ పని చేయనంత వరకు బాగుపడడు
ఇదంతా చూసి సాయిరెడ్డి కూడా తన భవిష్యత్తు రాజకీయలపై ఓ స్పష్టతకు వచ్చారని, అలా వచ్చిన తర్వాతే.. జగన్ ను కలిసి తన ఆవేదనను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కానీ.. జగన్ సైతం తన దగ్గరకు వచ్చిన ఆలోచనల్ని సాయి రెడ్డికి చెప్పి, ఆయనను మరింత ఆవేదనకు గురి చేశారంట. అందుకే.. ఇక పార్టీలో ఉన్నా కానీ, తనపై వచ్చిన అనుమానాలు కానీ, తనకు జరిగిన అవమానాలు కానీ తొలిగిపోవని నిర్ణయించుకున్నాకే.. పార్టీకి విజయసాయి రెడ్డి దూరమయ్యారని చెబుతుంటారు.