2029 ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర చేస్తారని అందరూ అంటున్నారు. జగన్ కూడా యాత్ర పార్ట్-2 ని కన్ఫామ్ చేశారు కూడా. అయితే ఆ యాత్రకు ముహూర్తం ఎప్పుడనేది మాత్రం ఇంకా తేలలేదు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు జగన్ ని పాదయాత్రకు ఫోర్స్ చేస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యాత్రలో ఉండగా అరెస్ట్ అయితే మరింత మైలేజ్ వస్తుందని జగన్ భావిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు.
పాదయాత్ర..
151 సీట్ల భారీ విజయం తర్వాత ఐదేళ్లలోనే 11 సీట్లకు పడిపోయిన వైసీపీలో అంతర్మథనం మొదలైంది. నవరత్నాల హామీలు అమలు చేసినా, సంక్షేమ పథకాలతో వేలకోట్లు పంచిపెట్టినా వైసీపీ ఎందుకు గెలవలేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే పైకి మాత్రం నెపాన్ని ఈవీఎంలపైకి నెట్టేసినా, లోలోన అసలు కారణాలు అన్వేషిస్తున్నారు నేతలు. అందులో వారికి దొరికిన అతిపెద్ద కారణం జనాలకు జగన్ దూరంగా ఉండటం. జగన్ పాదయాత్ర చేసి ఉంటే కచ్చితంగా ఎన్నికల్లో గెలిచి ఉండేవాళ్లం అనుకుంటున్నారు. ఈ విషయం జగన్ వరకు వెళ్లింది. కార్యకర్తలకు తాను దూరమయ్యానని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. జగన్ 2.ఓ ఇలా ఉండదని కూడా హామీ ఇచ్చారు. జనం కోసం, కార్యకర్తలకోసం పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు జగన్. అయితే ఎన్నికల ఏడాదిలో ఆ యాత్ర ఉంటుందనే అంచనాలున్నాయి. కానీ ఇప్పుడాయాత్ర ముందుకు రాబోతోంది.
ఎందుకు..?
రాజకీయ నాయకులు నిత్యం జనంలో ఉండాలి. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్నవారికి ఇది మరీ అవసరం. రాబోయే ఎన్నికల్లో జనం తమని గెలిపించాలంటే ఇప్పట్నుంచే జనంతో మమేకం కావాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే జగన్ పదే పదే ప్రజల్లోకి వెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. మామిడి రైతులు, పొగాకు రైతులు.. ఇలా పరామర్శలు మొదలు పెట్టారు. కార్యకర్తలను కూడా ప్రత్యేకంగా పరామర్శించేందుకు ఆయన యాత్రలు చేపడుతున్నారు. అయితే ఈ యాత్రలతో కొంతవరకే ప్రయోజనం ఉంటుంది, పైగా ప్రతిసారీ పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా నిత్యం ప్రజలతో ఉండేందుకు జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక్కో జిల్లాకు కొంత సమయం కేటాయించి అక్కడి గ్రామాల్లో పర్యటించబోతున్నారు.
లిక్కర్ స్కామ్ గుబులు..
ప్రతిపక్ష నేతగా వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న జగన్ కి ఇప్పుడు లిక్కర్ స్కామ్ గుబులు పట్టుకుంది. ఆ కేసులో అరెస్ట్ లు మిథున్ రెడ్డి వరకు చేరుకున్నాయి. ఇక మిగిలింది బిగ్ బాసేనంటూ వార్తలొస్తున్నాయి. జగన్ అరెస్ట్ పై సొంత పార్టీ నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ని అరెస్ట్ చేస్తారేమోనని అంటున్నారు. అయితే జగన్ కూడా ముందునుంచీ అరెస్ట్ లపై నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కంటే ఈ ఐదేళ్లు మరింత కఠినంగా ఉంటాయని ఆయన ఫిక్స్ అయ్యారు. అయితే జగన్ బెంగళూరులో ఉంటే అరెస్ట్ చేయడం వేరు, ఆయన జనంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం వేరు. జనంలో కలసి ఉంటే అరెస్ట్ తో మైలేజీ మరింత పెరిగే అవకాశముంది. జనంతో మమేకమయ్యే సందర్భంలో రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారనే ఆరోపణలు కూడా చేయొచ్చు. అందుకే జగన్ వీలైనంత త్వరగా పాదయాత్ర మొదలు పెడతారనే అంచనాలున్నాయి.