151 నుంచి 11కి పడిపోయిన తర్వాత మాజీ సీఎం జగన్ లో సంతోషం అనేది లేదు. అప్పటి నుంచి అన్నీ అపశకునాలే. చేజారుతున్న కేడర్, లీడర్లు, కోర్టు కేసులు, జైళ్లలో కాలక్షేపం చేస్తున్న నేతలు, అండర్ గ్రౌండ్ లో మరికొంతమంది.. ఇలా ఉంది వ్యవహారం. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదంటూ జగన్ అసెంబ్లీకి వెళ్లడమే మానేశారు. అప్పుడప్పుడు పరామర్శ యాత్రలు మినహా జగన్ బయట కనిపించడం లేదు. అయితే ఇప్పుడు సడన్ గా జగన్ నుంచి ఓ పాజిటివ్ ట్వీట్ పడింది. స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు
అవి వైసీపీ సీట్లే కదా..?
ఇటీవల స్థానిక సంస్థల సీట్లు ఖాళీగా ఉన్న చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం 50 సీట్లకు ఉప ఎన్నికలు జరుగగా అందులో 40 సీట్లను వైసీపీ కైవసం చేసుకుందని ఆ పార్టీ అనుకూల మీడియా కథనాలిచ్చింది. సోషల్ మీడియాలో కూడా రచ్చ జరుగుతోంది. టీడీపీ అనుకూల మీడియా ఈ ఎన్నికల ఫలితాలను కవర్ చేయకపోవడం విశేషం. ఆల్రడీ ఆ 50 సీట్లు వైసీపీకే చెందినవి కాగా వివిధ కారణాల వల్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు అందులో 40 తిరిగి వైసీపీ కైవసం చేసుకుంది, దీన్ని గొప్పగా చెప్పుకోవడమేంటనేది టీడీపీ లాజిక్. టీడీపీ సంగతి పక్కనపెడితే, వైసీపీలో మాత్రం ఇది కొత్త ఉత్సాహాన్ని నింపినట్టయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. స్వయానా అధినేత కూడా పాజిటివ్ ట్వీట్ వేయడంతో ఆ పార్టీలో కొత్త సందడి నెలకొంది.
ఇంతకీ జగన్ ఏమన్నారు…?
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా సీఎం చంద్రబాబు పోటీకి అభ్యర్థులను నిలబెట్టారని, అధికార అహంకారాన్ని చూపించి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు జగన్. కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించినా, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరించినా, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా.. ఇలా ఎన్నిరకాలుగా ప్రలోభాలకు గురిచేసినా వైసీపీ నేతలు మాత్రం లెక్కపెట్టలేదన్నారు. ఆ బెదిరింపుల్ని బేఖాతరు చేస్తూ వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడ్డారని, వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారని చెప్పారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైసీపీ నేతలను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు జగన్. క్లిష్ట సమయంలో వారు చూపించిన ధైర్యం పార్టీకి ఉత్తేజాన్ని ఇచ్చిందంటూ జగన్ ట్వీట్ వేయడం విశేషం. తాజా ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపు బాధ్యతలు తీసుకున్న నియోజకవర్గాల ఇంఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, ఇతర నేతలకు కూడా జగన్ అభినందనలు తెలిపారు. పార్టీకి వెన్నుముకలా నిలిచిన కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అని ట్వీట్ వేశారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, @ncbn గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2025
ఏ పార్టీకయినా కార్యకర్తలు ముఖ్యం. నాయకులు అధికారం ఉన్నప్పుడే పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు, అధికారం లేకపోతే మాత్రం సైలెంట్ గా ఉంటారు. క్షేత్ర స్థాయిలో ప్రత్యర్థులు పెట్టే ఇబ్బందుల్ని తట్టుకుని నిలబడటం కార్యకర్తలకు తప్పనిసరి. అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని అస్సలు పట్టించుకోలేదనే అపవాదు ఉంది. ఓటమి తర్వాత కూడా ఆయన ఈ విషయంపై పెద్దగా దృష్టిసారించలేదు. తొలిసారిగా ఆయన తన ట్వీట్ లో కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అని చెప్పడం మాత్రం విశేషం. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత విజయసాయి రెడ్డి సహా కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో కార్యకర్తల బలమే పార్టీకి నిజమైన బలమని జగన్ కి ఇప్పటికి అర్థమైనట్టుంది. అందుకే ఆయన తొలిసారిగా కార్యకర్తలను పొగుడుతూ ట్వీట్ వేశారు. మరి ఈ రియలైజేషన్ కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.