Kadapa Steel Plant: రెండు దశాబ్దాలుగా కడప జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న స్టీల్ ప్లాంట్ కల సాకారం కాబోతోంది. రాయలసీమ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేలా, యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి, ఈ ప్రాంతానికి పారిశ్రామిక కళ తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
జగన్ రెడ్డి మాట తప్పారు.. మడమ తిప్పారు
గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 2019 ఎన్నికల సమయంలో‘కడప స్టీల్ ప్లాంట్ నిర్మించకపోతే ఓట్లు అడగను’ అని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఆ మాటను తుంగలో తొక్కారన్నారు. 2019లో ఒకసారి, 2023లో మరోసారి శంకుస్థాపనల పేరుతో డ్రామాలు ఆడారని.. ఐదేళ్ల కాలంలో స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఇటుక కూడా వేయకుండా కడప ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గమైన పులివెందులకు కూడా ఒక్క కొత్త పరిశ్రమను గానీ, యువతకు ఒక్క స్థిరమైన ఉద్యోగాన్ని గానీ తీసుకురాలేకపోయారని మండిపడ్డారు.
ఫేక్ ఫ్యాక్టరీల కాలం పోయింది.. పరిశ్రమల కాలం వచ్చింది
2019-2024 మధ్య కాలంలో రాష్ట్రంలో కేవలం గొడ్డలి ఫ్యాక్టరీలు, ఫేక్ ఫ్యాక్టరీలు మాత్రమే వచ్చాయి తప్ప, నిజమైన పరిశ్రమలు రాలేదన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి అస్సలు లేదని.. నేడు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను పరిశ్రమల స్థాపనకు ప్రధాన కేంద్రంగా మారుస్తున్నామన్నారు . పారదర్శక విధానాలతో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తుందన్నారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?
గత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు చేసిన అభివృద్ధి, పరిశ్రమలు, యువతకు కల్పించిన ఉద్యోగాలపై బహిరంగ చర్చకు రావలసిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. రాయలసీమ హక్కులను కాపాడటం, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ముందంజలో ఉంచడమే మా ప్రభుత్వ ఏకైక లక్ష్యంమని తెలిపారు.