TDP vs YCP in Kakinada: కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలను నిర్వహించడం ఆనవాయితీ. అయితే కాకినాడలో నిర్వహించిన ఓ కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఒకే ఒక్క పదం ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది. ఇంతకు ఆ పదం ఏమిటో తెలుసా.. వైసీపీ ఎన్నికల సమయంలో నిర్వహించిన సిద్ధం కార్యక్రమం. అసలేం జరిగిందంటే..
కాకినాడలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శెట్టిబలిజ సంఘం అధ్వర్యంలో ఆదివారం వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ సైతం పాల్గొన్నారు. కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మంత్రి సుభాష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఇలా మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో పలువురు సిద్ధం అంటూ గట్టిగా నినదించారు. దీనితో మంత్రి సైతం సీరియస్ అయ్యారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో సిద్ధం అని అరవడం ఎంతవరకు సమంజసమని మంత్రి అన్నారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కడే గల వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గట్టిగా మరొకసారి సిద్ధం అంటూ నినదించారు.
ఇలా చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. టీడీపీ నేతలు ఒకవైపు వైసీపీ నేతలు మరోవైపు తాము కూర్చున్న కుర్చీలను సైతం విసురుకున్నారు. అలాగే కొద్దిసేపు కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడగా చిట్టచివరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘర్షణకు పాల్పడుతున్న వారిని పోలీసులు అక్కడి నుండి పంపించి వేయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చల్లబడింది.
కార్తీక వనభోజనాల కార్యక్రమం కాస్త ఘర్షణకు దారితీయగా, కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలు కొంత నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో సిద్దం అంటూ వైసీపీ బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిద్దం అనే ఒకే ఒక్క పదం, ఇక్కడి ఘర్షణకు కారణం కావడం విశేషం. ఘర్షణ జరుగుతుండగా, మంత్రి సుభాష్ ను పోలీసులు అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేశారు.