Rammurthy Naidu – CM Chandrababu: చెమ్మగిల్లిన కళ్లు.. చెప్పలేని ఆవేదన.. తమ్ముడి జ్ఞాపకాలతో అడుగులు.. ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన తమ్ముడి అంతిమయాత్రలో పాల్గొన్న తీరు. హైదరాబాద్ లో ఏఐజి వైద్యశాలలో అనారోగ్యంతో సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసిందే.
కాగా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. నారావారి పల్లెలో ఆదివారం సాయంత్రం రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలను నిర్వహించారు.
ముందుగా ఎందరో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నారావారి పల్లెకు చేరుకొని రామ్మూర్తి నాయుడుకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో భారీగా టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ అంతిమ యాత్రలో సీఎం చంద్రబాబు తన తమ్ముడి పాడెను మోసిన సమయంలో కళ్లు చెమ్మగిల్చారు.
తమ్ముడితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తలవంచి అంతిమయాత్రలో ఆవేదన పూరిత హృదయంతో పాల్గొన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్, రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ లు కూడా అదే స్థితిలో అంతిమయాత్రలో పాల్గొనగా, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా వారితో కలిసి పాడె మోశారు.
Also Read: TTD controversy: తిరుమలలో అన్యమత ప్రచారం? ఆ రీల్స్ తీసింది అక్కడేనా? ఆరా తీస్తున్న టీటీడీ విజిలెన్స్
చంద్రగిరి మాజీ ఎమ్మేల్యే గా రామ్మూర్తి నాయుడు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవడంతో, ఆ నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. అనంతరం రామ్మూర్తి నాయుడు భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే ఈ అంతిమయాత్రలో మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, ఎమ్మెల్యేలు, సీనియర్ నటుడు మోహన్ బాబు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.