AP News : ఆడుదాం ఆంధ్రా అవినీతి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. అటూఇటూ తిరిగి మళ్లీ మాజీ మంత్రి రోజా దగ్గరికే వచ్చి ఆగుతోంది. ఆ కేసులో ఆర్కే రోజా అరెస్ట్ పక్కా అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆమె రాయలసీమకు చెందిన ఓ మంత్రిని విజయవాడలో రహస్యంగా కలిశారనే ప్రచారం జరిగింది. ఆ కేసు నుంచి బయటపడేలా.. పాత పరిచయాలతో రోజా లాబీయింగ్ చేస్తున్నారని టీడీపీ అనుమానిస్తోంది. ఆనాటి అవినీతి బాగోతంపై ఇప్పటికే పక్కా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇలాంటి టైమ్‌లో.. అనుకోని తీగ పోలీసుల కాలికి తగిలింది. ఆ తీగ లాగితే రోజమ్మ డొంక కదిలే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? కేసులో కొత్త ట్విస్ట్ ఏంటి?
శాప్‌లోకి కడప అధికారి..
ఆడుదాం ఆంధ్రా టెండర్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిందనేది ఆరోపణ. 119 కోట్లు ఖర్చు చేయగా.. అందులో సగానికి పైగా నిధులు మాయం చేశారని అంటున్నారు. ఆ లెక్కలు బయటకు లాగుతున్న వేళ.. కీలక ఆధారం పోలీసులకు చిక్కింది. గత ప్రభుత్వం హయాంలో కడప జిల్లాకు చెందిన ఓ ఇంజనీరింగ్ అధికారిని డిప్యుటేషన్ మీద శాప్‌కు తీసుకొచ్చారు. అతని బదిలీ వెనుక ఆనాటి వైసీపీ పెద్దలు ఉన్నారనే ఆరోపణ విమర్శించింది. ఆడుదాం ఆంధ్రా టెండర్ల పని మొత్తం ఆ అధికారి కనుసన్నల్లోనే జరిగింది. ఇప్పుడు అదే ఆఫీసర్ యవ్వారం ఒకటి బయటకు వచ్చి కలకలం రేపుతోంది.
ఆమెకు 12 కోట్లు, భూమి.. దొరికిపోయారుగా..
శాప్ అధికారిగా పనిచేసిన ఆ అధికారి కోట్ల రూపాయలు దోపిడి చేసినట్టు తేలింది. టెండర్ల ద్వారా సంపాదించిన అవినీతి సొమ్మును.. విజయవాడకు చెందిన తన సన్నిహితురాలికి బదిలీ చేసినట్టు తెలుస్తోంది. మూడు వేరే వేరు అకౌంట్ల ద్వారా.. మొత్తం 12 కోట్లు ఆమె అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. డబ్బుతో పాటు ఒక విలువైన ల్యాండ్ కూడా ఆ సన్నిహితురాలి పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడట ఆ శాప్ అధికారి. ఈ విషయం మరెవరో చెబుతున్నది కాదు.. ఆ అధికారి కుటుంబ సభ్యులే ఈ వివరాలు బయట పెట్టారు. ఇటీవల అధికారి బంధువులు ఆ మహిళతో గొడవ పడ్డారు. ఇచ్చిన 12 కోట్లు, భూమి తిరిగి ఇచ్చేయాలని ఆమె ఇంటికెళ్లి మరీ తగాదా పెట్టుకున్నారు. అవి ఇచ్చేందుకు నిరాకరించిన మహిళ.. తనపై అధికారి ఫ్యామిలీ దాడి చేసిందంటూ ఆ మహిళ నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Also Read : వైసీపీ మారదా? ఆఖరికి ఆవులపై కూడా అబద్దాలేనా?
ముడుపుల సొమ్మేనా?
అయితే, ఘటనపై ఆ మాజీ శాప్ అధికారి మరో రకమైన వెర్షన్ చెబుతున్నారు. ఆ డబ్బు తనది కాదని.. తన ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం ఆ సొమ్ము అరేంజ్ చేశారని చెబుతున్నారు. పోలీసులు మాత్రం అతను చెప్పే మాటలు నమ్మట్లేదు. ఆ నగదు ఆడుదాం ఆంధ్ర టెండర్ల ముడుపులే అని అంటున్నారు. సీఐడీ సైతం వివరాలు ఆరా తీస్తోంది. అదే నిజమని తేలితే.. ఆ అధికారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే ఛాన్సెస్ ఉన్నాయి. మరి, ఆ విచారణలో ఆనాటి మంత్రి రోజా పేరు బయటకు వస్తుందా? వస్తే రోజాకు చిక్కులేనా?