Banana Peel: అరటి పండును తినడం చాలా సాధారణమైన విషయమే. అందులో పెద్ద వింత ఏమీ లేదు. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా జరుగుతుంది. అయితే అరటి పండు ప్రయోజనాలు తెలుసా..? దీన్ని చర్మానికి రాస్తే కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదా అనుకుంటున్నారా..? అరటి పండు తొక్కని కూడా తినొచ్చని మీకు తెలుసా..? దీని వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వినడానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజమట. అరటి పండు తొక్కని తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
అరటి తొక్క ఎందుకు తినాలంటే..?
అరటి తొక్క తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శరీరానికి అదనంగా పోషకాలు అందుతాయట. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.
పోషకాలు మెండు:
అరటి తొక్కను తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు అందుతాయట. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుందట. అంతేకాకుండా పోటాషియం ఎక్కువగా ఉండడంతో అరటి తొక్క తింటే గుండె, కండరాలకు మంచి జరుగుతుందట. అరటి తొక్కలో ఉండే మెగ్నీషియం నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే అరటి పండు తొక్కను డైరెక్ట్‌గా తినడానికి చాలా మంది ఇష్టపడకపోవచ్చు. అటువంటి సమయంలో దాన్ని కాస్త ఉడికించి తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పరగడుపున స్మూతీలు తీసుకునే అలవాటు ఉన్న వారు అరటి తొక్కను అందులో చేర్చుకోవడం ఉత్తమం. అలాగే అరటి తొక్కలను కూరల్లో లేదా సూప్‌లలో తీసుకోవడం కూడా మంచిది.
ALSO READ: బరువు తగ్గించే డ్రింక్స్..!
అయితే దీన్ని తీసుకునే ముందు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అరటిని పండించడానికి ఏవైనా కెమికల్స్ వాడి ఉంటే క్లీన్ చేసినప్పుడు అవి తొలగిపోతాయట. ఇదివరకు అరటి తొక్కను తినని వారు ముందుగా కొద్దిగా తిని.. దానికి బాడీ ఎలా స్పందిస్తుందో గమనించడం ఉత్తమం. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
అనేక లాభాలు ఉన్నప్పటికీ అరటి తొక్కను కూడా మితంగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటి తొక్కలో ఉండే అధిక ఫైబర్ కారణంగా దీన్ని మితిమీరి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందట. తొక్కను తినాలనుకునే వారు బాగా పండిన అరటిని ఎంచుకోవడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.